Dj-Duvvada-Jagannadham-controversyసిల్వర్ స్క్రీన్ పై ఉండే సెన్సిటివ్ పాత్రలలో బ్రాహ్మణుని రోల్ కూడా ఒకటి. అందుకే సాధారణంగా పెద్ద హీరోలు ఈ పాత్రల దరిదాపుల్లోకి వెళ్ళరు. నూటికో కోటికో ‘అదుర్స్, దువ్వాడ జగన్నాధమ్’ వంటి సినిమాలు వస్తూ ఉంటాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ‘అదుర్స్’పై పాటపై కూడా బ్రాహ్మణా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, పాట లిరిక్స్ ను మార్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మంచు విష్ణు ‘దేనికైనా రెడీ’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై బ్రాహ్మణ సంఘాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. అప్పట్లో పెద్ద రాద్దాంతం కావడంతో.., ఈ సినిమా కూడా మంచి విజయం సాధించిందనుకోండి… అది వేరే విషయం..!

ఇక ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “దువ్వాడ జగన్నాధమ్” సినిమాను అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ట్రైలర్ కూడా విడుదల కాని ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రెండు పాటలు విడుదల కాగా, రెండవ పాట అల్లు అర్జున్ – పూజా హెగ్డేల మధ్య మాంచి రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కింది. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఈ పాటతోనే! ఈ పాటలో ఉన్న కొన్ని పదాలు తమ సమాజాన్ని అవమానిస్తున్నాయని, బ్రాహ్మణ సేవా సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఋషులను కించపరిచేలా ఉన్న పాటను వెంటనే నిలుపుదల చేయాలని సెన్సార్‌ బోర్డుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరికలు జారీ చేసింది. సాహితి రాసిన ఈ పాటలో… “ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం… ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం…” అంటూ శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగార పరంగా ప్రస్తావించడంపై సమితి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

రుద్ర శ్లోకంలోని పదాలను శృంగార పరమైన భావాన్ని వ్యక్తీకరించడం తప్పు అన్నది వీరి భావన. అలాగే ఋషి పరంపరను, గోత్రనామాలను తెలిపే ‘ప్రవర’లో ప్రణయ మంత్రాలుంటాయనడం అపచారమని పేర్కొంటున్నారు. అంతే కాకుండా ‘‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం’’ అనే లైన్ తమను అవమానించడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన రచయిత సాహితి… హీరో బ్రాహ్మణ యువకుడని, తనకు తెలిసిన భాష, పదాలను వాడుతాడని, అందులో తప్పేంటో తనకు అర్థం కావడం లేదని తన భావన వ్యక్తం చేసారు.

ఎప్పుడో ఓ సారి హీరోలు అటెంప్ట్ చేస్తోన్న ‘బ్రాహ్మణ’ పాత్రలపై ఇలా ప్రతిసారి ఏదొక వివాదం చెలరేగడంతో, మున్ముందు ఇలాంటి రోల్స్ చేయాలంటే హీరోలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొంటుంది. అయితే ‘అదుర్స్’లోనూ ఇలాగే లిరిక్స్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఆ తర్వాత పాటను మార్చడం… ఆ సినిమా సూపర్ హిట్ కావడం అన్న సెంటిమెంట్ తో… ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా కూడా అదే బాటలో పయనిస్తుందేమోనన్న టాక్ హల్చల్ చేస్తోంది. మొత్తానికి ఆల్బమ్ విడుదల కాక ముందే బన్నీకి మ్యూజిక్ ప్రారంభమైనట్లయ్యింది.