Duvvada Jagannadham Lyrics Controversy“దువ్వాడ జగన్నాధమ్” సినిమాలోని ‘అస్మైక యోగ’ పాటలో తమకు అభ్యంతరం ఉన్న పదాలను తొలగిస్తానని చెప్పి దర్శకుడు హరీష్ శంకర్ తమను మోసం చేసారని, ఆ పదాలు అలాగే ఉన్నాయని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తలసానిని కలిసి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు విన్నవించుకున్న విషయం తెలిసిందే. సదరు పాటలోని లిరిక్స్ మార్చని పక్షంలో న్యాయపోరాటం చేస్తామని సైతం ఈ సందర్భంగా “డీజే” చిత్ర యూనిట్ ను హెచ్చరించారు.

దీనిపై స్పందించిన దర్శకుడు హరీష్ శంకర్… ‘అస్మైక’ పాటలోని వివాదాస్పద లిరిక్స్ ను ఖచ్చితంగా సినిమాలో మార్చివేస్తామని, అలాగే రెండవ బంచ్ సిడిలలో కూడా ఆ పదాలను తొలగించి, మరొకటి చేరుస్తామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం చేస్తున్నారని మొదటిసారిగా తమ దృష్టికి వచ్చిన సందర్భంలో… వివాదం సృష్టించడం ఎందుకన్న కోణంలో… ఇది తాము వాలెంటరీగా తీసుకున్న నిర్ణయమని హరీష్ శంకర్ అభిప్రాయ పడ్డారు.

దీంతో ‘దువ్వాడ జగన్నాధమ్’ వివాదం ఆడియో వరకు సమసిపోయినట్లే. అయితే సినిమా విడుదల తర్వాత కొత్త వివాదాలు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు అంటున్నారు సినీ జనాలు. గతంలో ‘అదుర్స్’ విషయంలో ఇలాగే ఆడియో పదాలపై ఇలాగే వివాదం చెలరేగగా, ఆ తర్వాత ‘దేనికైనా రెడీ’ సినిమా విడుదలైన తర్వాత ఏవీఎస్ పోషించిన బ్రాహ్మణ పాత్రపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో బ్రాహ్మణ సంఘాల కన్ను ‘డీజే’ విడుదలపై పడిందని చెప్పడంలో సందేహం లేదు.