Duvvada Jagannadham Audio Launchహరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న “దువ్వాడ జగన్నాధమ్” ఆడియో ఫుల్ ఆల్బంను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో తొలి రెండు పాటలు ప్రజాధరణకు నోచుకోవడంతో ఆల్బంపై అంచనాలు పెరిగాయి. మొత్తం అయిదు పాటలున్న ఈ సినిమాలో ‘అవుట్ స్టాండింగ్’ అన్న టాక్ ను తెచ్చుకుంది మాత్రం… ఒకే ఒక్క పాట. అది కూడా ఇటీవల బ్రాహ్మణ సంఘాల ఆగ్రహానికి గురైన ‘అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం’ అనే పాట.

జొన్నవిత్తుల రచించిన ‘డీజే’ టైటిల్ సాంగ్, సినిమాలోని హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే విధంగా ఉండడంతో అభిమానుల ఆదరణకు నోచుకుంది. విజయ్ ప్రకాష్ పవర్ ఫుల్ స్వరం ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ సినిమా సాంగ్ మాదిరి వినిపిస్తుండడం కొంత మైనస్. ఇక ఈ ఆల్బంకే హైలైట్ గా నిలిచిన ‘అస్మైక యోగ’ పాటను సాహితీ రచించగా, కార్తికేయన్, చిత్రలు ఆలపించారు. ఫస్ట్ లుక్ లోనే అందరినీ కట్టిపడేసే ఈ పాట, ఈ ఏడాదిలోనే వన్నాఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుందని చెప్పవచ్చు.

మూడవ పాటగా వినిపించిన ‘మెచ్చుకో’ పాటను మెచ్చుకోవడం మాత్రం కాస్త కష్టమే. ఈ ఆల్బం వీకెస్ట్ పాటగా దీనిని పేర్కొనవచ్చు. శ్రీమణి సాహిత్యం అందించగా, నకాష్ అజీజ్ ఈ పాటను ఆలపించారు. ఇది కూడా ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పాటను తలపిస్తుంది. నాలుగవ పాట అయిన ‘సీటి మార్’ అల్లు అర్జున్ లోని డ్యాన్స్ విశ్వరూపాన్ని చూపించే పాటగా పేర్కొనవచ్చు. బాలాజీ సాహిత్యం అందించిన సాహిత్యం మాస్ మెగా అభిమానులకు రీచ్ అయ్యే విధంగా ఉండగా, దేవిశ్రీ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసాడు.

ఇక ఫైనల్ గా ‘బాక్స్ బద్దలైపోయి’ అన్న పాట మాంచి మాస్ నెంబర్. గీత మాధురి, సాగర్ ఆలపించిన ఈ పాటకు భాస్కర్ భట్ల మాస్ లిరిక్స్ ప్లస్ పాయింట్. మొత్తమ్మీద ఈ ఆల్బమ్ లో ‘అస్మైక యోగ’ పాట లేకుండా ఉంటే చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఆ ఒక్క పాట మొత్తం ఆల్బం లుక్ నే మార్చేసింది. దాని తర్వాత ‘సిటీ మార్’ కాస్త వినసొంపుగా ఉండగా, మిగిలి మూడు పాటలు రొటీన్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నే తలపించే విధంగా ఉన్నాయి. అయితే అల్లు అర్జున్ డ్యాన్సింగ్ టాలెంట్ తో పోలిస్తే… విజువల్ గా అదిరిపోయే అవకాశాలే ఎక్కువ..!