Duvvada Jagannadham Allu Arjun - Harish Shankarఒక్కోసారి సరదాగా మాట్లాడిన మాటలు కూడా ఎంతో సీరియస్ అవుతాయో, ఇటీవల నటుడు చలపతిరావు ఉదంతం రుజువు చేసింది. తాజాగా అదే బాటలో “దువ్వాడ జగన్నాధమ్”లో బన్నీ పేల్చిన ఓ డైలాగ్ కూడా పయనిస్తోందా? అంటే అది ఇప్పుడే చెప్పలేం గానీ… సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతూ తెగ సందడి చేస్తోంది. “బెజవాడ అంటేనే పైన అమ్మ వారు ఉంటారు, కింద కమ్మ వారు ఉంటారు” అంటూ బన్నీ వేసిన డైలాగ్ ధియేటర్లలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా తెగ హంగామా చేస్తోంది.

అల్లు అర్జున్ చేత దర్శకుడు హరీష్ శంకర్ చాలా సరదాగా ఈ డైలాగ్ ను చెప్పించినట్లుగా సన్నివేశం చూస్తే అర్ధమవుతుంది. అయితే వర్తమాన రాజకీయ పరిస్థితులు ఈ డైలాగ్ కు అద్దం పట్టేలా ఉండడంతో, ప్రతి ఒక్కరూ దీనికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అందుకే ఈ డైలాగ్ వైరల్ గా మారిందని చెప్పాలి. విజయవాడ కేంద్రంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన నాటి నుండి, ‘కమ్మ’ వారి కోసమే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యక్తమైన రాజకీయ విమర్శలకు, ఆరోపణలకు కొదవలేదు.

అయితే రాజకీయ ఆరోపణలు సహజం గనుక, వీటికి ప్రాధాన్యత దక్కలేదు. కానీ తాజాగా అల్లు అర్జున్ నోట కూడా అదే ‘కమ్మ’ డైలాగ్ రావడంతో… బెజవాడ అంటే కమ్మ వారిదేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యేలా చేసింది. నిజానికి ఏపీ ప్రభుత్వాన్నో లేక ఇంకొకరినో ఉద్దేశించి ఈ డైలాగ్ రాసినట్లుగా అనిపించదు, సినిమాలో ఎక్కడా అలాంటి ఛాయలు కనిపించవు. కానీ వేరే సామాజిక వర్గానికి చెందిన హీరోగా బన్నీ నోట నుండి ఈ డైలాగ్ రావడమే చర్చనీయాంశం చేసింది. అయినా హరీష్ ఈ డైలాగ్ విషయంలో ఛాన్స్ తీసుకోకుండా ఉండాల్సింది!

ఎందుకంటే బెజవాడ అంటే ‘కమ్మ’ వారు ఎలా గుర్తొస్తారో, బన్నీ సామాజిక వర్గానికి చెందిన వంగవీటి మోహన రంగా కూడా అలాగే జ్ఞప్తికి వస్తారు. 80, 90వ దశకాల్లో జరిగిన ‘కాపు వర్సెస్ కమ్మ’ సంఘటనలు దేశంలోనే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మరి అలాంటి బ్యాక్ డ్రాప్ అయిన విజయవాడను ఎంచుకున్న హరీష్ శంకర్ డైలాగ్స్ విషయంలో మరింత జాగ్రత్త ఉండాలి కదా! సినిమాకు పెద్ద డ్యామేజ్ జరగదు గానీ… సిల్లీ విషయాలు కూడా సీరియస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా..!