Duvvada Jagannadham Allu Arjun Fake BO Collectionsవీక్షించిన ప్రేక్షకులలో ఎక్కువ శాతం మంది ‘బాగోలేదంటూ’ తిరస్కరించిన “దువ్వాడ జగన్నాధమ్” సినిమా మొదటి నాలుగు రోజుల్లో 75 కోట్లు కొల్లగోట్టిందని చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే తొలి వారంలో 100 కోట్ల మార్క్ ను దాటుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే తొలి రోజు నుండి వెలువడుతున్న ఈ సినిమా కలెక్షన్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన మాట వాస్తవం కాగా, తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ సంచలన కధనం ప్రచురితం చేసింది.

ప్రేక్షకుల చేత తిరస్కరించబడిన ఈ సినిమా నిజంగా అంతా కలెక్షన్స్ వసూలు చేసిందా? అనే ప్రశ్నను సంధిస్తూ… అల్లు అర్జున్ గత చిత్రం “సరైనోడు” విషయంలోనూ ఇదే జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసింది. అల్లు అర్జున్ స్టార్ హీరో కావడం, అలాగే ఏపీ, తెలంగాణాలలో ఎక్కువ ధియేటర్లు కలిగిన వ్యక్తిగా అల్లు అరవింద్ ఉండడంతో, ఈ కలెక్షన్స్ పై ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరని అభిప్రాయపడింది. నిజానికి ప్రస్తుత సినిమాల కలెక్షన్స్ లో పారదర్శకత లోపించిందని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కూడా ధృవీకరించారు.

ఈ సందర్భంగా గతంలో ‘మగధీర’ సమయంలో జరిగిన అవకతవకలు, ఇటీవల రాజమౌళి చేసిన కామెంట్స్ ను కూడా ప్రస్తావించారు. అయితే ఇలా నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ ప్రకటించడానికి గల బలమైన కారణం ఏమై ఉంటుందా? అంటే బడా స్టార్ హీరోల డేట్స్ ను సొంతం చేసుకోవడానికే నిర్మాతలు ఇలా ప్రకటిస్తారని తెలిపింది. ఒకవేళ తమ సినిమా ఫ్లాప్ అయితే ఫైనాన్షియర్స్ నుండి సహకారం లభించదన్న ఆలోచనలతో పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వరని, అందుకే ఇలా ‘బోగస్ కలెక్షన్స్’ను ప్రకటిస్తారని నిర్మాతల సైడ్ ఉద్దేశాలను కూడా తెలిపింది.

అయితే ఇప్పటికే “డీజే” కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఓ చిన్న పాటి యుద్ధమే జరుగుతుండగా, ఈ కధనం పెట్రోల్ పోసినట్లయ్యింది. ఒక దిల్ రాజునో లేక అల్లు అరవిందో చేస్తున్న పని కాదు, ఇండస్ట్రీలో బడా హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న చాలా మంది నిర్మాతల పరిస్థితి ఇదేనని కూడా తేటతెల్లం చేసింది. సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, సునీల్ నారంగ్ చేతులలో ఏపీ, తెలంగాణాలలో అత్యధిక ధియేటర్లు ఉండడమే వీటికి మరిన్ని అవకాశాలను కల్పిస్తోంది అన్నది ఈ కధనం సారాంశం.