Duvvada Jagannadhamనాలుగు రోజులకు 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, ఫస్ట్ వీక్ 100 కోట్లు గ్రాస్ గ్యారెంటీ అంటూ “దువ్వాడ జగన్నాధమ్” థాంక్యూ మీట్ లో నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానులకు ఇంకా గుర్తుండే ఉంటాయి. దర్శకుడు హరీష్ శంకర్ అయితే మరో అడుగు ముందుకేసి ‘నాన్ – బాహుబలి’ రికార్డులన్నీ కొల్లగొడుతుందని చెప్పారనుకోండి… అది వేరే విషయం..! ఎలాగైతేనేం ఈ సినిమా తొలి వారం పూర్తి చేసుకుని రెండవ వారం పోస్టర్ పడింది.

ఈ రెండవ వారం పోస్టర్ పై ముందుగా దిల్ రాజు ముందుగా చెప్పినట్లుగానే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అని ముద్రించారు. అయితే మొదటి వారం ముగియకుండానే అప్పుడే 100 కోట్ల గ్రాస్ ఎలా ప్రింట్ చేసారు? అన్న అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కు తెరలేపింది. రెండవ వారం పోస్టర్ పడాలంటే, దానికి సంబంధించిన డిజైన్ తదితర అంశాలను పూర్తి చేసి వాటిని ముద్రించి, ధియేటర్లకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం రెండు రోజులు ముందుగానే పూర్తి చేస్తారు. అంటే 5వ రోజునే పూర్తి కావాల్సి ఉంటుంది.

అంటే రెండవ శుక్రవారం వస్తుందంటే… బుధవారం నాటికల్లా డిజైన్, ముద్రణ పూర్తయ్యి, గురువారం నాటికి దియేటర్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇదంతా ఇంకా ముందే జరిగే అవకాశాలే ఎక్కువ. దిల్ రాజు ‘డీజే’ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. గురువారం ఉదయం నాటికే రెండవ వారం పోస్టర్లు పడ్డాయి. అయితే దీని మీద 100 కోట్ల గ్రాస్ ఉండడమే లాజిక్ లెస్ గా మారింది. తొలి 4 రోజులకు 75 కోట్లు వచ్చాయి కాబట్టి, మిగతా 3 రోజులు పూర్తయ్యే పాటికి మరో 25 కోట్లు వచ్చేస్తాయని అంచనా వేసి ముందుగానే ముద్రించారా?

లేక అయిదవ రోజుకే అవాక్కయ్యేలా 100 కోట్లు పూర్తయ్యాయా? అసలే ఈ సినిమా కలెక్షన్స్ లో అవకతవకలు జరిగాయని ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రిక సంచలన కధనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. అలాగే సోషల్ మీడియాలో సినీ అభిమానుల మధ్య ఇప్పటికీ వాడి వేడి చర్చలు జరుగుతున్న నేపధ్యంలో… ముందుగానే ముద్రించిన ఈ పోస్టర్లు మరో చర్చకు తెరలేపాయి. ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచి, సినిమాను మళ్ళీ మళ్ళీ చూసేలా చేయడానికి ఇలాంటి పోస్టర్లు ఉపయోగపడతాయి తప్ప, ఇండస్ట్రీలో వీటిని ఎవరూ సీరియస్ గా పరిగణించరనేది ట్రేడ్ టాక్.