dubai dynamic-tower-detailsదుబాయ్ పేరు చెప్పగానే ప్రపంచంలోనే ఎత్తైన ‘బుర్జ్ ఖలీఫా’ భవనం గుర్తొస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎత్తులో బూర్జ్ ఖలీఫాకు సరితూగకపోయినా, మరింత ఆశ్చర్యం కలిగించే అద్భుత కట్టడం మరొకటి దుబాయ్ లోనే నిర్మాణాన్ని జరుపుకుంటోంది. దీనికి “డైనమిక్‌ టవర్‌”గా నామకరణం చేశారు. దీని నిర్మాణానికి తొమ్మిదేళ్ల కిందట ఇజ్రాయిల్-ఇటాలియన్‌ ఆర్కిటెక్ట్‌ డేవిడ్‌ ఫిషర్‌ రూపకల్పన చేయగా, 1,375 అడుగుల ఎత్తుతో 80 ఫ్లోర్లతో నిర్మిస్తున్నారు.

ముందుగా ఈ భవనం మధ్య భాగంలో ఎత్తైన కాంక్రీట్ నిర్మాణాన్ని చేపట్టారు. వేరే చోట యూనిట్లను తయారు చేసి, ఆ కాంక్రీటు నిర్మాణానికి అటాచ్‌ చేస్తూ గదులను నిర్మిస్తున్నారు. 2008లో దీని నిర్మాణం ప్రారంభించగా, 2020 నాటికి నిర్మాణం పూర్తి కానుంది. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వల్ల ఈ భవంతిలో ఉన్న వారికి వినూత్న అనుభూతిని కల్పిస్తుందని రూపకర్త చెబుతున్నారు. ఈ టెక్నాలజీలో భాగంగా అదనపు విద్యుత్ ను తీసుకోవాల్సిన అవసరం లేదని, సోలార్ విద్యుత్ ను దీనికిదే సొంతంగా తయారు చేసుకుంటుందని తెలిపారు.

వాయిస్ ఆక్టివేటెడ్ కమాండ్ సిస్టమ్ తో ఈ బిల్డింగ్ లోని గదులను ఎలా కావాలంటే అలా తిప్పేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ భవనం ప్రత్యేకతే గదులను మనకు నచ్చినట్టు తిప్పుకోవడమని, సూర్యోదయం చూడాలనుకుంటే మన గదిని తూర్పు వైపు కనిపించేలా, సూర్యాస్తమయం చూడాలనుకుంటే మన గదిలోంచి పడమర దిక్కు కనిపించేలా తిప్పేసుకోవచ్చని తెలిపారు. భూమి తన చుట్టూ తాను తన కక్ష్యలో పరిభ్రమిస్తున్న రీతిలో దీని నిర్మాణం ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఇందులో సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, ఇందులో ఫ్లాట్ కొనాలనుకుంటే 200 కోట్ల రూపాయల ధర ఉంటుందని, బిల్డింగ్ ప్రారంభోత్సవం నాటికి కొనాలనుకుంటే అప్పటి ధర ఎంతో ఇప్పుడే చెప్పలేమని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఈ భవంతిని బిజినెస్‌ లేదా వ్యక్తిగత పర్యటనల కోసం వచ్చే వారి కోసం నిర్మిస్తున్నామని, వారికి ఈ కట్టింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీ సరికొత్త అనుభూతిని అందిస్తుందని డైనమిక్‌ గ్రూప్‌ చెబుతోంది. ఈ భవనం నిర్మాణ రంగంలోనే సరికొత్త విప్లవంగా నిపుణులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.