drugs mafia  threat calls  to Akun-Sabharwal- హైదరాబాద్ లో డ్రగ్స్ లేకుండా చేయాలని నిర్ణయించుకున్న ఎక్సైజ్ డీఐజీ అకున్ సబర్వాల్ కు బెదిరింపులు వస్తున్నాయి. గత 10 రోజులుగా ప్రతి రోజూ ఫోన్ చేసి అంతు చూస్తామని బెదిరించే డ్రగ్ మాఫియా… శుక్రవారం నుండి నుంచి రూట్ మార్చినట్లుగా తెలుస్తోంది. నీ పిల్లలు ఏ స్కూల్ లో చదువుతారో తెలుసు, ఏ వాహనాల్లో, ఎప్పుడు? ఎక్కడికి? వెళ్తారో కూడా తెలుసు… అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది.

అకున్ సబర్వాల్ కు వస్తున్న ఫోన్ కాల్స్ పై దర్యాప్తు చేపట్టింది. ఇందులో షాకింగ్ కలిగించే విషయమేమిటంటే… అకున్ కు వస్తున్న ఇన్ కమింగ్ కాల్స్ ఇంటర్నేషనల్ కాల్స్ గా తేలింది. అయితే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? వంటి వివరాలను ఆరా తీయడంలో ఇంటిలిజెన్స్ విభాగం తలమునకలైంది. ఇలా బెదిరింపు కాల్స్ వస్తున్నప్పటికీ సిట్ విచారణ ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంటూ బ్యాంకులకు లేఖలు రాయనుంది సిట్.

కలకలం రేపిన ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులైన 14 మంది బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులకు లేఖ రాయనుంది. బిట్ కాయిన్స్ ఎక్స్ ఛేంజ్ అకౌంట్స్ ను కూడా ఫ్రీజ్ చేయించాలని ఏసీబీని సిట్ కోరింది. డ్రగ్స్ సరఫరా చేసేవారి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని చెబుతూ నార్కోటిక్ బ్యూరో విదేశీ బ్యాంకులకు లేఖలు రాసింది. వారి అకౌంట్స్ నిలిపివేయడం ద్వారా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొడితే వారే దారికి వస్తారని సిట్ భావిస్తోంది. దీంతో ఆ 14 మంది డ్రగ్ డీలర్ల అకౌంట్లు నిలిపేయాలని సిట్ కోరుతోంది.

ఇదిలా ఉంటే… తొలి మూడు రోజుల్లో పూరీ గ్యాంగ్ ను విచారించిన సిట్, నేడు హీరో తరుణ్ ను విచారణ చేయనుంది. క్రికెటర్ కావాలని కలలు కని, సినిమాల్లో ఆకట్టుకున్న తరుణ్ గతంలో పబ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. ఈ పబ్ నుంచే ఇతర పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు కెల్విన్ విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో తరుణ్ పై సంధించేందుకు సిట్ అధికారులు ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని నివాసం నుంచి తరుణ్ తండ్రి చక్రపాణితో కలిసి నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నాడు.