Drugs case charge sheet without movie star namesనాలుగేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు… ఆ తరువాత ఉన్నఫళంగా సైలెంట్ అయిపోయింది. అప్పట్లో 11 మంది ప్రముఖులతో పాటు హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా ఎక్సైజ్ అధికారులు విచారించారు. ఆ తరువాత అనూహ్యంగా ఆ కేసు ఊసు కూడా లేదు. ఇప్పుడు ఆ కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.

ఈ కేసు విషయమై సెంటర్ పర్ గుడ్ గవర్నెర్స్ ప్రతినిధులు గతంలో హైకోర్టును ఆశ్రయించడంతో కేసులో కదలిక వచ్చింది. నాలుగేళ్ల త‌రువాత సిట్ దాఖ‌లు చేసిన ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. మొత్తంగా 12 డ్రగ్స్ కేసుల్లో 8 కేసులకు సంబంధించి చార్జీషీట్ దాఖలు చేసింది.

అయితే కొసమెరుపు ఏమిటంటే…. ఈ డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారు. అసలు ఛార్జ్ షీట్ లో వారి ఊసే లేదని అంటున్నారు. మరి అప్పుడు వారిని ఎందుకు విచారణకు పిలిపించినట్టు? విచారణ సందర్భంగా ఏం తేలింది అని చెప్పాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంటుంది.

ఈ కేసుల్లో ఇప్పటికే 30 మందిని అరెస్ట్ చేశారు. మరో 27 మందిని విచారించారు. కేవలం డ్రగ్స్ అమ్మే వారి మీద కేసులు పెట్టి… మిగతా వారిని అందులోనూ మరీ ముఖ్యంగా పరపతి కలిగిన వారిని బాధితుల పేరిట కేసుల నుండి తప్పిస్తున్నారని ఎప్పటి నుండో విమర్శలు ఉన్నాయి.

2017లో ఈ కేసు మొదటి సారిగా తెరమీదకు వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వారిని లొంగదీసుకోవడానికి ప్రభుత్వం వేసిన ప్లాన్ ఇది అని విమర్శించిన వారు కూడా ఉన్నారు.