Droupadi-Murmu-TDP-Chandrababu-Naiduరాష్ట్రపతి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు బిజెపి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకు మద్దతు ఇవ్వడంతో సిఎం జగన్మోహన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని మిర్చి9 తెలుగు వెలిబుచ్చిన అభిప్రాయం నిజమే అని దృవీకరిస్తూ సాక్షి మీడియాలో ‘రాష్ట్రపతి ఎన్నిక: టీడీపీ డబుల్‌ గేమ్‌’ పేరుతో శనివారం ఓ ఆర్టికల్ వచ్చింది.

దానిలో చంద్రబాబు నాయుడు ద్రౌపదీ ముర్ముకి మద్దత్తు ఇవ్వడం ద్వారా మళ్ళీ బిజెపికి దగ్గరవ్వాలని వెంపర్లాడుతున్నారని పేర్కొంది. ఈ విషయంలో టిడిపి డబుల్ గేమ్ ఆడిందని ఆరోపించింది. ముందు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాలని తన అనుకూల మీడియా ద్వారా సిఎం జగన్మోహన్ రెడ్డిపై తెచ్చేందుకు విఫలయత్నం చేసిన చంద్రబాబు నాయుడు, తరువాత బేషరతుగా ద్రౌపదీ ముర్ముకి మద్దతు ప్రకటించారని ఆరోపించింది.

అయితే సిఎం జగన్మోహన్ రెడ్డి ‘రాష్ట్ర అవసరాలను’ దృష్టిలో ఉంచికొని ద్రౌపదీ ముర్ముకి మద్దతు ప్రకటించారని పేర్కొంది. జగన్‌కు ఎప్పుడు దేని గురించి మాట్లాడాలో బాగా తెలుసు కనుకనే ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టలేదని సాక్షి పేర్కొంది.

దేశంలో రాజకీయపార్టీలు ఎల్లప్పుడూ ఒకే విధానానికి కట్టుబడి లేవని పరిస్థితులను బట్టి ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తుంటాయని వివరిస్తూ అనేక రాజకీయ ఉదాహరణలను పేర్కొంటూనే, చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి ఎన్నికను ఓ అవకాశంగా మలుచుకొని మళ్ళీ బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం చాలా నేరమన్నట్లు సాక్షి పేర్కొంది.

బిజెపిపై కత్తులు దూస్తున్నందున తెలంగాణ సిఎం కేసీఆర్‌ ద్రౌపదీ ముర్ముకి మద్దతు ఇవ్వలేదని, కానీ జగన్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది గనుక రెండు రాష్ట్రాలపై ఆ ప్రభావం ఏవిదంగా ఉండబోతోందో చూడాలని చెపుతూనే రాష్ట్రపతి ఎన్నిక ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండబోదని సాక్షి పేర్కొంది. అంటే ఒకే అంశంపై రెండు పార్టీలు భిన్నంగా వ్యవహరించినప్పుడు ఆ ప్రభావం తెలంగాణపై ఉంటుంది కానీ ఏపీపై ఉండదని వితండవాదం చేస్తున్నట్లు అర్దమవుతోంది.

ఈ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉండదంటే టిడిపితో బిజెపి చేయి కలపదని, కనుక రాష్ట్ర రాజకీయాలలో పార్టీల బలాబలాలు మారవని వైసీపీ చెపుతున్నట్లే భావించవచ్చు. జగన్ ప్రత్యేకహోదాకు పట్టుబట్టకపోవడం తప్పేమీ కాదని సమర్ధించుకోవడం విస్మయం కలిగిస్తుంది. “ఏది ఏమైనా రాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏకి మద్దతు ఇచ్చిన నేపధ్యంలో ఏపీకి కేంద్రం మరింత ఇతోధికంగా సాయం చేస్తే అదే పదివేలు,” అని ముగించింది. అంటే ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టడం కంటే, జగన్ ప్రభుత్వానికి నెలనెలా అప్పులు చేసుకొనేందుకు అవకాశం లభిస్తే అదే పదివేలు,” అని సాక్షి మీడియా పేర్కొంది. ఇంతకీ టిడిపి ముర్ముకు మద్దతు ఇస్తే తప్పేమిటి? బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే వైసీపీ ఎందుకు ఆందోళన చెందుతోంది?అంటే టిడిపి, బిజెపిలు మళ్ళీ ఎక్కడ దగ్గరవుతాయో అనే వైసీపీలో అభద్రతాభావమే అని చెప్పవచ్చు. అదే జగన్ ఆత్మసాక్షిలో స్పష్టంగా కనబడింది.