Driver_Subramanyam_Family_Met_Chandrababu_Naiduకాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కుటుంబంలో వైసీపీ ప్రభుత్వం చీలిక తెచ్చిందా?అంటే అవుననే అనిపిస్తోంది. సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చింది. మూడు రోజుల క్రితమే కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఆమెకు నియామక పత్రాన్ని కూడా అందజేశారు.

అయితే సుబ్రహ్మణ్యంపైనే ఆధారపడి జీవిస్తున్న తల్లితండ్రులను ప్రభుత్వం పట్టించుకోలేదు. అపర్ణకు ఉద్యోగం ఇవ్వడంతో తమ బాధ్యత పూర్తయిందని అధికారులు చేతులు దులుపుకొన్నారు. భర్త చనిపోయినందున, ఇప్పుడు ప్రభుత్వోద్యోగం కూడా వచ్చినందున అపర్ణ ఇప్పుడు అత్తమావగార్లతో ఉండకపోవచ్చు. కనుక ఆమె వెళ్లిపోతే వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది.

దీంతో సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు నూకరత్నం, సత్యనారాయణాలు ఇవాళ్ళ హైదరాబాద్‌ వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు నాయుడుని కలిసి తమ గోడు మొరపెట్టుకొన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తమ కుమారుడిని అన్యాయంగా చంపేశాడని కానీ అతను అధికారిక పార్టీకి చెందినవాడు కనుక జగన్ ప్రభుత్వం, పోలీసులు అతనిని ఈ కేసునుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే పోలీసులు తమకు న్యాయం చేస్తారనే నమ్మకం లేదని కనుక సిబిఐ చేత విచారణ జరిపించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు నాయుడు వారిని ఓదార్చి సిబిఐ చేత విచారణ జరిపించేందుకు తనవంతు తప్పకుండా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ తరపున రూ.5 లక్షలు చెక్కు అందించారు.

ఈ కేసులో సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ ప్రధాన సాక్షిగా ఉంటుంది. కనుక ఈ కేసును నీరుగార్చడానికి తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలలో ఆమె వలన ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ప్రభుత్వం హడావుడిగా ప్రభుత్వోద్యోగం ఇచ్చి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వోద్యోగంలో చేరిన తరువాత ఆమె ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విదంగా మాట్లాడలేదు కనుక ఈ ఉద్యోగంతో ఆమె నోరు కుట్టేసినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ ఆమెకు ఉద్యోగం ఇవ్వడం మంచిదే కానీ దాంతో సుబ్రహ్మణ్యం కుటుంబంలో చిచ్చు పెట్టినట్లయింది. లేకుంటే సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు హైదరాబాద్‌ వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలిసి ఉండేవారే కాదు కదా?