Dr-NTR-University-of-Health-Sciences-YSR-University-of-Health-Sciencesవైసీపీ ప్రభుత్వానికి టిడిపిపై ఎంత రాజకీయ ద్వేషం ఉందంటే ఆ పార్టీని, దాని అధినేత చంద్రబాబు నాయుడునే కాదు.. ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌ పేరుని కూడా తుడిచిపెట్టేయాలనంత! ప్రతీకారేచ్చతో రగిలిపోయేవారినే అది దహించివేస్తుందని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. అయినా ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైసీపీ ప్రభుత్వం మార్చేసింది. సిఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల, సొంత పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినా పట్టించుకోలేదు.

దీనికి సంబందించి జీవోకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయగానే హెల్త్ యూనివర్సిటీలో ఎక్కడా ఎన్టీఆర్‌ పేరు కనబడకుండా తుడిచేయాలని ప్రభుత్వం నుంచి యూనివర్సిటీ అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. వారు యూనివర్సిటీలో ఎన్టీఆర్‌ పేరు తుడిచేసే పనిలో ఉండగా వైసీపీ ప్రభుత్వం తన పరిధిలో యూనివర్సిటీ వెబ్‌సైట్‌ పేరు, దాని చిహ్నంలో మార్పులు చేసేసింది. తాజాగా ప్రభుత్వం‌ ఆమోదించిన కొత్త చిహ్నంలో కింద ఎన్టీఆర్‌ పేరు స్థానంలో డా.వైఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (1986) గా మార్చింది.

ఇక ప్రభుత్వ ఆదేశం మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.సిహెచ్. శ్రీనివాసరావు నేమ్ బోర్డు కింద డా. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని మార్పించారు. యూనివర్సిటీలోని తరగతి గదుల్లో, కంప్యూటర్లలో ఎక్కడ ఎన్టీఆర్‌ పేరున్నా వాటిని తొలగించి డా. వైఎస్సార్ అని మార్పిస్తున్నారు.

యూనివర్సిటీలో గోడల మీద, బోర్డుల మీద, బల్లలు, కుర్చీల మీద, కంప్యూటర్లలోను వ్రాయబడిన ఎన్టీఆర్‌ పేరును వైసీపీ ప్రభుత్వం చెరిపివేయగలదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్లాది తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోయిన ఎన్టీఆర్‌ పట్ల గొరవాన్ని, ప్రేమాభిమానాలను, ఆయన రూపాన్ని తుడిచిపెట్టగలదా?అజరామరంగా నిలిచిపోయే ఎన్టీఆర్‌ కీర్తి ప్రతిష్టలను ఒక జీవోతో తుడిచేయగలమనుకోవడం అవివేకమా అజ్ఞానమనుకోవాలా?