Dr-NTR-University-of-Health-Sciences-Name-change-to-YSR-University-of-Health-Sciences-టిడిపి, చంద్రబాబు నాయుడుని సిఎం జగన్‌ ఎంతగా ద్వేషిస్తున్నారంటే, వేలకోట్లు పెట్టి నిర్మిస్తున్న అమరావతిని కూడా పక్కనపెట్టేసే అంత! దానితోనే రాష్ట్ర భవిష్యత్‌ ముడిపడి ఉంటుందని తెలిసి ఉన్నా తన ద్వేషానికి దానిని పణంగా పెట్టేరు. అమరావతినే పక్కనపెట్టేసినప్పుడు, ప్రజావేదికను కూల్చివేయడం, అన్నా క్యాంటీన్‌లను మూసివేయడం పెద్ద విశేషమేమీ కాదు. చంద్రబాబు నాయుడు ఆలోచనలకు, ఆశయాలకు, సమర్దతకు అద్దం పట్టే ఏదైనాసరే ఆ ద్వేషానికి బలైపోక తప్పదని ఈ మూడేళ్ళ వైసీపీ పాలనలో స్పష్టమైంది.

టిడిపి, చంద్రబాబు నాయుడుపై ప్రతీకారం తీర్చుకోవడానికి రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం?అనే ప్రశ్నకు వచ్చే ఎన్నికలలో ప్రజలే సమాధానం చెపుతారు. కానీ తెలుగు ప్రజలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారకరామారావుపై కూడా పగ ఎందుకు?రాజకీయాలలో, సినిమాలలో, సంక్షేమ పధకాలు అమలుచేయడంలో ఆయనకు ఆయనే సాటి అని పొరుగు రాష్ట్రాలవారు కూడా చెప్పుకొంటారు. కానీ జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆయన పేరును కూడా తుడిచిపెట్టేసేందుకు సిద్దం అవుతోంది. డాక్టర్ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం నేడు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టబోతోంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సవరణ బిల్లును ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు.

Also Read – సజ్జలని బహిరంగంగా అలా మాట్లాడొద్దని ఎవరైనా చెప్పండర్రా!

రాష్ట్రంలో వైద్య విద్యాలకు ప్రత్యేకంగా ఓ యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ దానిని 1986, నవంబర్‌ 1వ తేదీన ఏర్పాటు చేశారు. 1998, జనవరి 8వ తేదీన నాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో దానిపేరును డాక్టర్ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. 2000, నవంబర్‌లో 1వ తేదీన సిద్ధార్థ ప్రభుత్వ వైద్యకళాశాల ఆవరణలో రెండేకరాల సువిశాలమైన భవన సముదాయం నిర్మించి దానిలోకి మార్చారు. అప్పటి నుంచి అక్కడ అదే పేరుతో కొనసాగుతోంది. విశ్వవిద్యాలయం రజతోత్సవం సందర్భంగా 2011, నవంబర్‌ 1వ తేదీన అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు కూడా. కనుక యూనివర్సిటీ పేరుతో పాటు దానిని తొలగించి దాని స్థానంలో వైఎస్సార్ విగ్రహం పెడుతుందా?

అసలు ఇంత ఘనమైన చరిత్ర ఉన్న ఆ యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరం ఏమిటి?అంటే ఆయన పేరుతో టిడిపి కొనసాగుతుండటమే. నేటికీ ఎన్టీఆర్‌పై అభిమానం, గౌరవంతో టిడిపికి ఓట్లు వేసేవారు రాష్ట్రంలో లక్షలమంది ఉన్నారు. కనుక రాష్ట్రంలో టిడిపి కనబడకుండా తుడిచిపెట్టేయాలని కసితో రగిలిపోతున్న సిఎం జగన్మోహన్ రెడ్డి, టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పేరును కూడా తుడిచిపెట్టేసేందుకు సిద్దం అవుతున్నారనుకోవలసి ఉంటుంది.

Also Read – వైనాట్ పులివెందుల?బీటెక్ రవి

కానీ ఎన్టీఆర్‌ ఒక పార్టీకో, ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదని కోట్లాది ప్రజల హృదయాలలో కొలువై ఉన్నారని జగన్ ప్రభుత్వానికి తెలియదనుకోలేము. ఆనాడు ఎన్టీఆర్‌ అయినా వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అయినా తాము చేసిన పనులతోనే ప్రజల అభిమానం పొందారు తప్ప మా గొప్పదనాన్ని ప్రజలందరూ గుర్తించండని దేబిరించలేదు. వారి గౌరవార్దం పెట్టుకొన్న పేర్లను మార్చేయడానికి వైసీపీ ప్రభుత్వం ఏ కుంటిసాకు చెపుతుంది? ఎన్టీఆర్‌ పేరున జిల్లా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకొన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు యూనివర్సిటీకి ఆయన పేరును ఎందుకు తొలగిస్తోంది?

హైదరాబాద్‌తో సహా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కూడా ఎన్టీఆర్‌, వైఎస్సార్ విగ్రహాలున్నాయి. పార్కులు, భవనాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వాలు వాటి పేర్లను మార్చే ఆలోచన కూడా చేయలేదు. కానీ ఎన్టీఆర్‌ పుట్టిన గడ్డలోనే ఆయన పేరు కనబడకుండా తుడిచిపెట్టేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుండటం దురదృష్టకరం. చనిపోయిన ఆ మహనీయుడి పట్ల కూడా ఇంత ద్వేషమా? వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. అంటే ఇదేనేమో?

Also Read – టిడిపి పోలిటికల్ ర్యాగింగ్… మామూలుగా లేదుగా!