Dr Muddhineni VenkataRamanaవైసీపీలో విభీషణ పాత్ర పోషిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణరాజు లంకేశ్వరుడి గురించి ఎప్పటికప్పుడు టిడిపి, జనసేనలను హెచ్చరిస్తూనే ఉంటారు. ఇటీవల ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “టిడిపి తర్వాత జనసేన వంతే. మా వైసీపీ ప్రభుత్వం టిడిపి నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తూనే ఉంది. ఇప్పుడు జనసేనపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కనుక జనసేన నేతలు, కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. వారిపై ఎప్పుడు ఏ కేసులు నమోదవుతాయో… ఎవరెవరు జైలుకి వెళ్ళవలసి వస్తుందో తెలీదు కానీ వెళ్ళక తప్పదు. కనుక జనసేన నేతలు, కార్యకర్తలు అందరూ మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం,” అని రఘురామ కృష్ణరాజు హెచ్చరించారు.

ఆయన హెచ్చరించినట్లే, కుప్పం జనసేన ఇన్‌ఛార్జ్‌ మద్దిరాల వెంకటరమణ ఈరోజు తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆయన 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తాను కుప్పంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంటే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అందుకే పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని తెలిపారని సాక్షి మీడియా తెలియజేసింది.

చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టిడిపినే వదిలిపెట్టని వైసీపీ నేతలు జనసేన ఇన్‌ఛార్జ్‌ వెంకటరమణని వదిలిపెడతారనుకోవడం రాజకీయ అజ్ఞానమే. ఇప్పుడు తమ అధినేత కుప్పంపై పూర్తి ఫోకస్ పెట్టారు కనుక ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకొంటే అప్పుడు కుప్పంలో వైసీపీకి ప్రత్యర్ధిగా జనసేన మిగులుతుంది. వైసీపీ బలం, బలగం ముందు కుప్పం జనసేన ఇన్‌ఛార్జ్‌ మద్దిరాల వెంకటరమణ ఎన్నికలలో తట్టుకొని నిలబడటం అసంభవమే. కానీ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు ఇప్పుడు ఆయనపై నయన్నో, భయన్నో లొంగదీసుకొని రాజీనామా చేయించి ఉండవచ్చు.

నరసరాపురంలో తమను పార్టీ, సినిమా బ్యానర్లు కూడా కట్టుకోనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకొంటున్నారని జనసేన కార్యకర్తలు ఇటీవల పవన్‌ కళ్యాణ్‌కి మొరపెట్టుకొన్నారు. ఇప్పుడు కుప్పంలో జనసేనను ఖాళీ చేయించేశారు. నిన్న విజయవాడలో వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అందరూ సమావేశమై పవన్‌ కళ్యాణ్‌ని ఏవిదంగా నిలువరించాలని చర్చించుకొన్నారు. ఈ పరిణామాలను బట్టి జనసేనపై వైసీపీ ఒత్తిళ్ళు ఎంతగా ఉన్నాయో, ఉండబోతున్నాయో అర్దం చేసుకోవచ్చు. కనుక జనసేన వీటిని తొలి హెచ్చరికగా తీసుకొని తమకు బలం ఉందని భావిస్తున్న నియోజకవర్గాలలో పార్టీని వైసీపీ ఖాళీ చేయించేయకుండా జాగ్రత్త పడటం మంచిది. రఘురామ కృష్ణరాజు చెప్పింది ఇదే కదా?