Dr Kodela Siva Prasada Rao-Suicide-no moreటీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కాసేపటి క్రితం కన్నుమూశారు. కోడెల గుండెపోటుకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారని అంటున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. మరి కొందరు కోడెల తన హైదరాబాద్ నివాసం ఉరి వేసుకున్నారని ఆయనను ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయిందని అంటున్నారు.

అయితే కుటుంబసభ్యులు దానిని కొట్టిపారేస్తున్నారు. 2019 ఎన్నికలలో ఓడిపోయారు ఆయన. అప్పటి నుండి వచ్చిన కొత్త ప్రభుత్వం అనేక కేసులలో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సంపాదించుకున్న మంచి పేరు అంతా పోయే ప్రమాదం ఉండడంతో ఆయన తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. దానితో ఇటువంటి పరిస్థితికి దారి తీసింది. 1983, 85, 89, 1994, 2014లో నరసరావుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

కేవలం 2004, 2009 ఎన్నికలలో మాత్రమే ఆయన ఓడిపోయారు. 2014లో సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. 1987-88 మధ్యలో హోంమంత్రిగా ఈయన పనిచేశారు. 1996-97 భారీ మధ్యతరహా, నీటిపారుదల మంత్రిగా, 1997-99 మధ్యలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రిగా కోడెల పనిచేశారు. 2014-19 వరకూ ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ తొట్టతొలి స్పీకర్ గా పని చేశారు. అభిమానులు, అనుచరులు ‘పల్నాటి పులి’గా పిలుచుకునే కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.