Dr Kodela Siva Prasada Rao- death big loss to TDPఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కోడెల శివప్రసాదరావు కాసేపటి క్రితం మృతి చెందారు. గుండె పోటు కారణమని కొందరు అంటుండగా, ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కొందరు అంటున్నారు. ఎలాగైతేనేం తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నేతను కోల్పోయింది. అయితే తెలుగుదేశం పార్టీ గురించి బాగా తెలిసిన వారికి ఒక విషయం అనిపించకమానదు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండి బాగా ఇబ్బందుల్లో ఉన్నట్టు అనిపించినప్పుడల్లా తన సీనియర్ నేతలను కోల్పోతుంది.

2004-14 మధ్య తెలుగుదేశం పార్టీ అత్యంత గడ్డుకాలం అని అంతా అంటారు. ఆ సమయంలో పార్టీ పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, వంటి సీనియర్ నాయకులను కోల్పోయింది. 2019 ఎన్నికల ఓటమి తరువాత టీడీపీ మరోసారి గడ్డు కాలం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలలో ఘోరపరాజయం, భవిష్యత్తు నాయకత్వం గురించి అనుమానాల నేపథ్యంలో, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వ్యతిరేక ప్రభుత్వాలు ఉండడం వల్ల టీడీపీకి వచ్చే ఐదేళ్ళు గడ్డు కాలం అంటున్నారు.

ఇప్పుడు అటువంటి సమయంలోనే మరో సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుని కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. కోడెల పార్టీకి పల్నాడు ఏరియాలో కీలకమైన నేత. ఆయనను ఇటువంటి కీలకమైన తరుణంలో కోల్పోవడం టీడీపీకి భారీ నష్టం అనే చెప్పుకోవాలి. ఈ వార్తతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు, అభిమానులు తీవ్రంగా కలతచెందారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోడెల మృతికి సంతాపం తెలియజేశారు.