Dr C Narayana Reddy Passed awayప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి కేర్ ఆసుపత్రిలో చికిత్స సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారే, 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో రైతు దంపతులు మల్లారెడ్డి, బుచ్చమ్మలకు జన్మించారు. బాల్య వివాహం చేసుకున్న సినారే సతీమణి పేరు సుశీల కాగా, వీరికి గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి నదుల పేర్లతో నలుగురు కుమార్తెల సంతానం ఉన్నారు.

ఇక సాహితీవేత్తగా సినారే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన రచించిన విశ్వంభర కావ్యానికి గాను 1988లో ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం వరించింది. అలాగే 1977లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 1992 పద్మభూషణ్ పురస్కారాలను పొందిన సినారే మృతి చెందడంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తెలుగు పాఠక, సినీ ప్రేక్షక లోకానికి సుపరిచితులు అయిన సి.నారాయణరెడ్డి రచించిన పాటలు తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించాయి.

1962లో వచ్చిన ‘గులేబకావలి కథ’లో నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ… అని ఆయన రాసిన పాట, ఇప్పటికీ మరువలేనిదే. దాదాపుగా 3000 పాటలకు పైగా రాసిన ఆయన కలం నుండి జాలువారిన అద్భుతమైన గానాలు ఎన్నో… ఎన్నెన్నో..! ‘బందిపోటు’లో వగలరాణివి నీవే సొగసుకాడను నేనే, ‘రాముడు భీముడు’లో తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే…, ‘మంగమ్మ శపథం’లో కనులీవేళ చిలిపిగ నవ్వెను, ‘బంగారు గాజులు’లో అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, ‘ధర్మదాత’లో ఓ నాన్నా నీ మనసే వెన్న,’ లక్ష్మీ కటాక్షం’లో రా వెన్నెల దొరా కన్నియను చేరా… వంటి పాటలు కొన్ని మచ్చుతునకలు.

ఇవి మాత్రమే కాదు, ‘చెల్లెలి కాపురం’లో కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా, ‘మట్టిలో మాణిక్యం’లో రింఝిం రింఝిం హైదరబాద్, ‘బాలమిత్రుల కథ’లో గున్న మామిడి కొమ్మ మీదా గూళ్లు రెండున్నాయి, ‘తాత మనవడు’లో అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ‘శారద’లో శారదా, నను చేరగా ఏమిటమ్మా సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా, ‘అల్లూరి సీతారామరాజు’లో వస్తాడు నా రాజు ఈ రోజు, ‘కృష్ణవేణి’లో కృష్ణవేణి, తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి, నా ఇంటి అలివేణి, ‘ముత్యాల ముగ్గు’లో గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ, ‘శివరంజని’లో అభినవ తారవో నా అభిమాన తారవో…

‘మంగమ్మగారి మనవడు’లో చందురుడు నిన్ను చూసి, ‘స్వాతిముత్యం’లో లాలి లాలి లాలీ లాలి, వటపత్రశాయీ వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి, ‘సూత్రధారులు’లో జోలా జోలమ్మ జోల నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల, ’20వ శతాబ్దం’లో అమ్మను మించి దైవమున్నదా?, ‘ఒసే రాములమ్మా’లో ఓ ముత్యాల కొమ్మా… ఓ రాములమ్మా, ‘ప్రేమించు’లో కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా,’ సీతయ్య’లో ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ, ‘అరుంధతి’లో జేజమ్మా జేజమ్మా… వంటి ఎన్నో పాటలను ఆయన కలం అందించింది.