పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా ఈ వారంలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఓపెనింగ్స్ లో దుమ్ము దులుపుతూ అడ్వాన్స్ బుకింగ్ లతో ‘సర్ధార్’ ప్రభంజనం ప్రారంభమైంది. తొలి రోజు రికార్డు కలెక్షన్స్ కోసం భారీ స్థాయిలో విశ్లేషకుల విశ్లేషణలు, అభిమానుల వాగ్వివాదాలు జరుగుతూ వస్తున్నాయి. ట్రైలర్ అంత ఆసక్తిని రేపకపోవడంతో తాజాగా మరికొన్ని టీజర్లు, ట్రైలర్లను చిత్ర యూనిట్ విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది.
అయితే సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా నిడివి విషయంలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్ర నిడివి 2 గంటల 44 నిముషాలుగా డిక్లేర్ అయ్యింది. ‘నాన్నకు ప్రేమతో’ వంటి కాస్త వినూత్నమైన సినిమాలకు ఈ స్థాయి నిడివి అంటే ఓకే గానీ, ఒక ఫక్తు మాస్ కమర్షియల్ సినిమాకు ఇంత సమయం ప్రేక్షకులు కేటాయించాలంటే కాస్త ఆలోచించదగ్గ విషయం. అయితే వెండితెరపై కామెడీ పండితే మాత్రం… ఈ స్థాయి నిడివి అయినా గానీ ప్రేక్షకులు గమనించే లోపు సినిమా పూర్తయిపోతుంది.
మరి ‘సర్ధార్’ ద్వారా పవన్ చేసింది వెండితెరపై పండిందో లేదో తెలిసుకోవాలంటే మరో నాలుగు రోజులు ఆగాలి. అయితే ధియేటర్ల వద్ద పవన్ అభిమానుల హంగామాతో “సర్ధార్ గబ్బర్ సింగ్” సందడి అప్పుడే ప్రారంభమైంది. ‘బాహుబలి’ మినహా అన్ని రికార్డులను ‘సర్ధార్’ సొంతం చేసుకుంటాడనే అంచనాలతో అభిమానులు ఉన్నారు.