ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నడూలేని విదంగా ప్రస్తుతం కాపు సామాజికవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. అందుకు కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కాపు సామాజికవర్గం మద్దతు కోరుతుండటమే. ఈసారి ఆయన మరింత రాజకీయ పరిణతి ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుండటంతో కాపు సామాజికవర్గం కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉంది. అయితే జనసేన ఒంటరిగా పోటీ చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కనుక ఆయన టిడిపితో కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
సరిగ్గా ఇదే వైసీపీకి గుబులు పుట్టిస్తోంది. టిడిపి, జనసేనలతో రాష్ట్రంలో అన్ని పార్టీలు కట్టకట్టుకొని పోటీ చేసినా మాకు తిరుగులేదని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ వాటి పొత్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం గమనిస్తే, ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నట్లయితే రాష్ట్రంలో కాపులందరూ వాటివైపు వెళ్ళిపోతారనే భయం ఆందోళన స్పష్టంగా వారి మాటల్లో వినిపిస్తోంది.
అందుకే వైసీపీలో కాపు మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చి వాటి పొత్తుల గురించి, కాపు ఓటు బ్యాంక్ గురించి పదేపదే మాట్లాడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. బహుశః అందుకే మాజీ మంత్రి పేర్నినాని మంచి సమర్దుడైన కాపు నాయకుడు ముఖ్యమంత్రి అయితే మంచిదే అని అనాల్సివచ్చింది.
కానీ కాపు సామాజికవర్గానికే చెందిన మంత్రి కొట్టు సత్యనారాయణ మాత్రం నిర్మొహమాటంగా ‘మాకు కాపు ముఖ్యమంత్రి అవసరం లేదు. జగనన్న మాకు చాలు,’ అని చెప్పేశారు. నిజానికి వైసీపీలో కాపు మంత్రులందరూ కూడా అదే కోరుకొంటున్నారు. ఎందుకంటే, వారిలో ఎవరికీ ముఖ్యమంత్రికాగల శక్తి సామర్ధ్యాలు లేవు. వైసీపీలో వారికి ఆ అవకాశం ఉండదు కూడా.
ఇక ప్రతిపక్షాలలో ముఖ్యమంత్రికాగల కాపు నాయకుడు ఎవరూ కనబడటం లేదు. కనుక మళ్ళీ టికెట్ లభించాలన్నా, వచ్చే ఎన్నికలలో పోటీ చేసి గెలవాలన్నా తమ అధినేత జగన్ కరుణాకటాక్షాలు, ఆయన ఫోటో వారికి తప్పనిసరి. అయితే కాపు సామాజికవర్గం టిడిపి, జనసేనలవైపు మొగ్గితే, జగనన్న భజన చేసినా ఎవరూ గెలిచే అవకాశం ఉండదు. కనుక వైసీపీలో కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులందరూ కూడా ఓ పక్క సిఎం జగన్, కాపు భజన చేస్తూ మరోపక్క ఈవిదంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లని విమర్శిస్తునారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ సచివాలయంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “మనవాడు ముఖ్యమంత్రి అవుతాడనే ఆశతో రాష్ట్రంలో కాపులు పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారు. వారు కాపునేతని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోవచ్చు కానీ మాకు మాత్రం కాపు ముఖ్యమంత్రి అవసరం లేదు. మాకు మా జగనన్న చాలు. కులపరంగా పవన్ కళ్యాణ్‌ని నేను గౌరవిస్తాను కానీ అతను బిజెపిని పెళ్ళి చేసుకొని టిడిపితో సంసారం చేస్తానంటూ మా కాపుల పరువు తీస్తున్నారు. ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపినంత మాత్రన్న ఏమీ జరగదు. జగనన్నని ఓడించడం వారి వల్లకాదు,” అని అన్నారు.