Donald Trump USA Elected Presidentఅమెరికా ఎన్నికలలో సంచలనం నమోదైంది. రాజకీయ పండితుల, మీడియా సర్వేల అంచనాలను తారుమారు చేస్తూ ట్రంప్ అనూహ్య విజయం సాధించారు. రెండు రోజుల క్రితం మాట్లాడిన ట్రంప్… ‘ఫలితాల తర్వాత మీడియా అవాక్కవ్వాల్సి ఉంటుంది… చూసుకోండి…’ అన్న వ్యాఖ్యలు కార్యరూపం దాలుస్తాయని ఎవరూ ఊహించలేదు. కానీ, అదే జరిగింది. ఒక్క మీడియానే కాదు, రాజకీయ విశ్లేషకులు, సర్వేలు చేపట్టిన వారు కూడా అవాక్కయ్యారు. అయితే అమెరికన్లు ఇంతటి అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటి? ట్రంప్ చేసిన మ్యాజిక్ ఏమిటి… అంటే జాతీయవాదం మేల్కొల్పడమేనని చెప్పాలి.

ఒక విధంగా చెప్పాలంటే… ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు విషయంలో కేసీఆర్ అవలంభించిన విధానాలనే అమెరికాలో ట్రంప్ కూడా అవలంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల వలన స్థానిక వాసులు ఎంతగా నష్టపోతున్నారో చెప్పి, ప్రజల్లో భావోద్వేగాలు రగిల్చిన కేసీఆర్ మాదిరే, ఇండియా తదితర దేశాల వలన అమెరికా వాసులకు ఉద్యోగాలు రావడం లేదని, తానూ అధికారంలోకి వస్తే అమెరికన్లకే తొలుత ప్రాధాన్యం ఇస్తానని, అలాగే ప్రస్తుతం ఉద్యోగాలలో ఉన్న వారిని కూడా వెనక్కి పంపించేస్తానని చేసిన కీలక వ్యాఖ్యలు నిరుద్యోగుల్లో తీవ్ర ప్రభావం చూపడంతో ట్రంప్ విజయానికి కారణమైనట్లుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

కేసీఆర్ ఎలాగైతే తెలంగాణా వాదాన్ని ప్రజల్లోకి ఎక్కించడంలో సక్సెస్ సాధించారో, అలాగే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ ట్రంప్ కూడా జనాల్లో జాతీయభావం పెంపొందేలా వ్యాఖ్యానించడంలో సక్సెస్ సాధించారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఇవన్నీ ఇంత ప్రభావం చూపుతాయని ప్రత్యర్ధి పార్టీలు భావించకపోవడంతో, ఈ అంశాలను లైట్ గా తీసుకున్నారు. కానీ, చివరికి ఇవే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి కారణమయ్యాయంటూ అభిప్రాయ పడుతున్నారు. లేకుంటే ఎన్నో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్ విషయం ఊహించినది కాదు. ఏది ఏమైనా అమెరికాను ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా నిలబెడతానని ట్రంప్ విజయం తర్వాత వ్యాఖ్యానించారు.