donald-trump-appreciates narendra-modi-ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన డొనాల్డ్ ట్రంప్, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కొనియాడార‌ని, ట్రంప్ కు చెందిన భారత వ్యాపార పార్టన‌ర్‌ పంచశిల్ రియాలిటీ డైరెక్టర్ సాగర్ చోర్దియా పేర్కొన్నారు. భార‌త ప్ర‌ధాని మోడీని డొనాల్డ్‌ ట్రంప్ ప‌లు సమావేశాలలో ప్ర‌శంసిస్తూ ఉంటార‌ని చెప్పారు. మోడీ గొప్ప ప‌నులు చేస్తూ ముందుకెళుతున్నార‌ని ట్రంప్ వ్యాఖ్యానించిన‌ట్లుగా పేర్కొన్నారు. దీంతో ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు మరింత బలపడతాయని అనుకుంటున్న‌ట్లుగా చెప్పుకొచ్చారు.

ఇటీవ‌లే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో భారత్ కు చెందిన వ్యాపారులు అతుల్ చోర్దియా, సాగర్ చోర్దియా, కాల్పేశ్ మెహతాతో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో భారత ఆర్థిక వ్యవస్థ, మోదీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పైనే మాట్లాడుకున్నామ‌ని సాగర్ చోర్దియా మీడియాకు తెలిపారు. ఈ భేటీలో డొనాల్డ్‌ ట్రంప్ వారసులు ఇవాంకా, ఎరిక్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా పాల్గొన్నార‌ని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్‌కు భార‌త్‌లోనూ వ్యాపారాలు ఉన్నాయని, ఇండియాలో ఉన్న‌ ఐదు లగ్జరీ ప్రాజెక్టుల్లో ‘ట్రంప్ టవర్’ కూడా ఒక‌టి.

దీనిని పుణెలో పంచశిల రియాలిటీ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. అంతేగాక‌, ఆయ‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో ముంబ‌యిలో మ‌రో 300 అపార్టుమెంటులు నిర్మిస్తున్నారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా ట్రంప్ వారసులు భార‌త్‌ లో త‌మ ప్రాజెక్టుల‌ను విస్త‌రించేందుకు ఆసక్తి చూపిన‌ట్లు తెలుస్తోంది. అధికారికంగా సదరు సమాచారం వెల్లడి కానప్పటికీ, మీడియా వర్గాలలో మాత్రం ప్రధానంగా వినపడుతోంది.