Dokka-Manikya-Vara-Prasad-Ambati-Rambabuగుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భయాలు నిజమని మంత్రి అంబటి రాంబాబు నిర్ధారించారు. వచ్చే ఎన్నికలలో తాడికొండ టికెట్ డొక్కా మాణిక్య వరప్రసాద్‌కే అని సంకేతం ఇచ్చారు. తాడికొండ నియోజకవర్గానికి డొక్కాను అదనపు ఇన్‌ఛార్జిగా నియమించడంతోనే ఈ విషయం ఖరారు అయింది.

నిన్న గుంటూరులోని కృష్ణానగర్‌లో వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. గురువారం దీని ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి అంబటి రాంబాబు విలేఖరులతో మాట్లాడుతూ, “డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు గతంలో తాడికొండకు ప్రాతినిధ్యం వహించారు. అక్కడి కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. వచ్చే ఎన్నికలలో డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తాడికొండలో చాలా కీలకపాత్ర పోషించబోతున్నారు,” అని అన్నారు.

అంటే సిటింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టబోతున్నట్లు స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మనవే అని సిఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ, కనీసం 60-70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందని వారిని మార్చకపోతే వైసీపీకి ఓటమి తప్పదని ఐ-ప్యాక్ ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం.

జగన్ సొంత సర్వేలో కనీసం 50-60 మందిని మార్చక తప్పదని తేలడంతో అత్యవసరంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి అందరూ తప్పనిసరిగా గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనాలని, తమ పనితీరు మెరుగుపరుచుకోకపోతే టికెట్లు ఇవ్వలేదని బాధపడవద్దని గట్టిగానే హెచ్చరించారు. కానీ ఈలోగానే ఈవిదంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కకు తప్పించి వారి స్థానంలో వేరేవారిని సిద్దం చేసుకొంటున్నట్లు స్పష్టమవుతోంది.

డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు మంత్రి అంబటి రాంబాబుకి చాలా కాలంగా సన్నిహితులుగా ఉంటున్నారు. కనుక తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని పక్కకు తప్పించడానికి ఆయనే ఈవిదంగా చక్రం తిప్పారని శ్రీదేవి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. వారి అనుమానాలు నిజమేనని మంత్రి అంబటి రాంబాబు మాటలతో స్పష్టమయ్యింది. కనుక ఎమ్మెల్యే శ్రీదేవి వేరే దారి చూసుకోక తప్పదేమో?