ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేర్చుకోగలిగారు కానీ తనకు లభించిన ఈ అపూర్వమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని చెప్పక తప్పదు.
ప్రజల ఆకాంక్షలను అర్దం చేసుకొని రాజధాని నిర్మాణపనులు వేగవంతం చేసి రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించి ఉండి ఉంటే, ఆయన కోరుకొన్నట్లుగానే మరో 30 ఏళ్ళు ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజిస్తుండేవారు. కానీ ‘తేలికగా మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా?’ అని ఆలోచిస్తూ మూడున్నరేళ్ళు అన్నీ తప్పటడుగులే వేస్తూ ముందుకు సాగారు.
వాటి తొలి ఫలితమే నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల రూపంలో కనబడింది. అదొక్కటే అయితే తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ గాడిన పడవచ్చు. కానీ లిక్కర్ స్కామ్, వివేకా హత్య కేసు రెండు భూతాల్లా వైసీపీని వెంటాడుతున్నాయి. అవి ఇప్పట్లో వదిలేలా లేవు కూడా. కనుక జగన్ చక్రవర్తి వాటిని భేతాళుడిలా భుజాన్నేసుకొనే ప్రతిపక్షాలు, ప్రజలకు సమాధానాలు చెప్పుకొంటూ ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది.
సంక్షేమ పధకాలు ఏపీ రాజకీయాలలో ‘గేమ్ చేంజింగ్’ అవుతాయని, వాటితో ప్రతిపక్షాలకు అన్ని దారులు మూసుకుపోతాయనుకొంటే, వాటి కోసం చేసిన అప్పులతోనే జగన్ ప్రభుత్వానికి అన్ని తలుపులు మూసుకుపోతున్నాయి. ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఆలస్యం, వారి బకాయిలు, జీపీఎఫ్ ఖాతాలలో తీసి వాడేసుకోవడం వంటివన్నీ పట్టభద్రుల ఎన్నికలలో వైసీపీ పరాజయానికి ఎంతో కొంత కారణమయ్యాయని అందరికీ తెలుసు.
మూడు రాజధానులతో మూడు ప్రాంతాల ప్రజలను విడదీసి టిడిపి, జనసేనలతో మూడు ముక్కలాడాలని చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. విశాఖ రాజధాని అయితేనే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందుతుందని లేకుంటే అసాధ్యమని నిసిగ్గుగా చెప్పుకొన్న మంత్రి ధర్మానకు ఆ జిల్లా ప్రజలు ఈ ఎన్నికలతో బాగానే బుద్ది చెప్పారనుకోవచ్చు.
మంత్రి బొత్స వారి కంచుకోట విజయనగరంలో ప్రజలు కూడా ఈ మూడు రాజధానుల బుర్రకధని పట్టించుకోకుండా టిడిపికి జై కొట్టారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల తమ ప్రభుత్వంపై ఎంత కోపంగా ఉన్నారో, వారు ఆగ్రహిస్తే ఏమవుతుందో మంత్రి బొత్సవారు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదే. విశాఖ వాసులైతే “సిఎంసార్ గోబ్యాక్…” అంటూ ఏకంగా బోర్డు పెట్టేసి తమ అభిప్రాయం కుండ బద్దలు కొట్టిన్నట్లు చెప్పేశారు.
అంటే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలు అన్నీ బెడిసికొడుతున్నాయని స్పష్టం అవుతోంది. అలాగే 2019 ఎన్నికల సమయంలోలాగా వైసీపీకి కాలం కలిసి రావడంలేదని ‘రెండు కేసులు’ చెపుతున్నాయి.
కనుక రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయాలని కాక, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు మిగిలిన ఈ పుణ్యకాలంలో వైసీపీ తనను తాను పరిశుద్ధం చేసుకోవడం చాలా అవసరం. కాదని ఇదేవిదంగా గుడ్డిగా ముందుకు సాగితే ప్రజలు రెండో ఛాన్స్ ఇవ్వకపోవచ్చు.