Does the YS jagan have the guts to challenge Chandrababu Naidu?రివర్స్ టెండరింగ్ విధానం కనిపెట్టిన జగన్ సారే… రెండున్నరేళ్ళ మంత్రి పదవులనే నూతన విధానం కూడా కనిపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోతే రెండున్నరేళ్ళ తర్వాత మార్చేస్తానని ముందే చెప్పారు కనుక పదవులు పోయినవారు లోలోన బాధపడ్డారే తప్ప ఎవరూ బిగ్గరగా అసమ్మతిరాగాలు ఆలపించలేదు.

మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు బాగోకపోతే వారిని మార్చేయడం రాజకీయాలలో సర్వసాధారణమైన విషయమే కానీ ముఖ్యమంత్రి పనితీరు కూడా బాగుందో లేదో నిర్ణయించి మార్చుకొనే విధానం ఉంటే బహుశః నేడు వైసీపీలోమరొకరికి ముఖ్యమంత్రి అవకాశం కలిగి ఉండేది కదా?

ఇక అసలు విషయం ఏమిటంటే, రేపు సిఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోగ్రాస్ రిపోర్ట్ చదవబోతున్నారుట!ముఖ్యంగా గడప గడపకి కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యారు?ఈ కార్యక్రమంపై ప్రజాస్పందన ఎలా ఉంది? మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది?వచ్చే ఎన్నికలలో 175 సీట్ల కోసం ఎవరిని ఉంచుకోవాలి?ఎవరిని పక్కన పెట్టాలి?అనే అంశాలపై రేపు సిఎం జగన్ వారికి క్లాసు పీకబోతున్నారని సమాచారం. రెండోసారి తీసుకొన్న మంత్రులలో ఇద్దరికీ ఉద్వాసన పలికి వారి స్థానంలో ఇద్దరినీ తీసుకొనే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

కనుక రేపు జరుగబోయే ఈ సమావేశం చాలా కీలకమనే భావించవచ్చు.ఇటువంటి సమావేశాలు లేనప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు అందరూ కూడా తమ ప్రభుత్వానికి, పార్టీకి గొప్ప ప్రజాధారణ ఉందని, వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మాకే అని చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు.

చంద్రబాబు నాయుడు టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్లు ఖరారు చేస్తూ, సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆవిదంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్లు ఇవ్వగలరా? అని సవాల్ చేశారు. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డికి తమ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు చాలా గొప్పగా ఉందనే నమ్మకముంటే చంద్రబాబు నాయుడు సవాలు స్వీకరించి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తామని ప్రకటిస్తారు లేకుంటే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రేపు జరుగబోయే సమావేశం నిరూపించబోతోంది.