ఏదైనా మోతాదులో ఉంటేనే బాగుంటుంది. అది మితిమీరితే అజీర్తికి దారి తీసి అసలుకే మోసం వచ్చేస్తుంది. థియేటర్లలో ఆడేసి ఎప్పుడో వెళ్ళిపోయిన సినిమాల రీ రిలీజుల తతంగం అచ్చంగా ఇలాగే తయారయ్యింది. శివరాత్రి వస్తోంది. ఒకప్పుడు అర్ధరాత్రి తెల్లవారుఝామున స్పెషల్ షోలు వేసి పవిత్రంగా జరగాల్సిన జాగారాన్ని దాన్నో సంబరంగా మార్చేశారు. సరే పుణ్యం రాకపోయినా పర్వాలేదని ఎంజాయ్ చేస్తే చాలనే ధోరణిలో జనం వీటికి ఎగబడి వెళ్ళేవాళ్ళు. అప్పుడు శాటిలైట్లు ఓటిటిలు లేవు కాబట్టి మిస్సమ్మ యమగోల లాంటి పాత క్లాసిక్ కి సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడ్డ సందర్భాలు బోలెడున్నాయి.
గత అయిదు నెలలుగా లెక్కలేనన్ని రీ రిలీజులు థియేటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పోకిరితో మొదలయ్యింది. జల్సాతో పీక్స్ కు చేరుకుంది. చెన్నకేశవరెడ్డిని ఆదరించారు. ఇంకేముంది ఎప్పుడూ ఇదే స్పందన ఉంటుందని భావించిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అత్యాశకు పోయి వారానికి ఒకటి రెండు అదే పనిగా రీ మాస్టర్ ఫోర్ కె పేరుతో ఇబ్బడిముబ్బడిగా వదలడం మొదలుపెట్టారు. మధ్యలో ప్రేమదేశం లాంటి బ్లాక్ బస్టర్ ఊసులో లేకుండా పోయింది. కలర్ మాయాబజార్ పరువు పోయింది. ఇవాళ నువ్వొస్తానంటే నేనొద్దంటానాకు క్రాస్ రోడ్స్ తప్ప ఇంకెక్కడా అడిగేవాడు లేడు.
ఈ ఏడాది శివరాత్రికి మళ్ళీ వీటికి తెరతీశారు. సరిలేరు నీకెవ్వరు, పుష్ప, టెంపర్, అరవింద సమేత వీర రాఘవ, అఖండ, ఖుషి ఇలా అన్నీ నిన్నా మొన్నా చూసినట్టుగా ఉన్న సినిమాలనే మళ్ళీ ఆడించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుపెట్టడం ఆలస్యం ఇదుగో మీ హీరోకు బుకింగ్స్ లేవంటూ ఖాళీ సీట్లను చూపించి యాంటీ ఫ్యాన్స్ పరస్పరం ట్రోలింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభిమానులు వాటిని ఫుల్ చేయించేందుకు చూడటం ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి మరీ సోల్డ్ అవుట్ చూపించడం కోసం సిద్ధపడుతున్నారు.
ఆ షోలు మొదలయ్యే టైంకి బాణాసంచా, డీజేలు, ఊరేగింపులు, పోటాపోటీగా అల్లర్లు చేసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. టికెట్లతో పాటు వీటికయ్యే ఖర్చు ఒక్కో ఏరియాకి లక్షల్లో ఉంటుంది. ఎవరి నొప్పి వాళ్ళదని సింపుల్ గా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇవి కొత్త సినిమాలను దెబ్బ కొడుతున్నాయి. జేబులో ఉన్న నాలుగు డబ్బులని ఇలా తగలేసుకుంటే కొత్త వాటికి టికెట్లు కొనడానికి సొమ్ములు ఎక్కడ నుంచి వస్తాయి. హీరోల గొప్పలు ట్విట్టర్ లో చూపించుకునేందుకు ఫ్యాన్స్ పడుతున్న తంటాలు అన్నీఇన్నీ కావు. చివరాఖరికి ఈ రికార్డులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని తెలిసినా కేవలం ఫేక్ ఐడిల సోషల్ మీడియా ప్రపంచంలో డాబులు పోయేందుకు వాడుకోవడం విచారకరం.