Priyanka Gandhiతొలిసారిగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా మోడీ ప్రభుత్వం పట్ల దేశప్రజలలో ఎంతో కొంత వ్యతిరేకత కనబడుతూనే ఉంది. పెద్దనోట్లు రద్దు, లాక్‌డౌన్, జీఎస్టీ, రైతు, ముస్లిం వ్యతిరేక చట్టాలు ఇంకా అనేక అంశాల కారణంగా మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. కనుక బిజెపికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసివచ్చే అంశమే.

కానీ ప్రతీ ఎన్నికతోనూ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూనే ఉంది. బిజెపి బలపడుతూనే ఉంది. దీనికి కారణం కాంగ్రెస్‌ నాయకత్వ లోపమే. సోనియా గాంధీ అనారోగ్యం, వయోభారంతో పార్టీ పగ్గాలు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగిస్తే, దేశానికి ప్రధాని మంత్రి కావాలనుకొంటున్న లేదా కాంగ్రెస్ పార్టీలో ఆ అర్హత కలిగిన ఏకైక నాయకుడిగా చెప్పుకోబడుతున్న రాహుల్ గాంధీ, తల్లి కంటే చాలా ముందే అంటే 2019 ఎన్నికల తర్వాత అస్త్రసన్యాసం చేసేసి కాంగ్రెస్ పార్టీని రోడ్డునపడేసి భారత్‌ జోడో అంటూ తనూ రోడ్డున పడ్డారు.

అయితే నేటికీ దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలు కాంగ్రెస్ పార్టీని కలుపుకోకుండా మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొలేమని గట్టిగా భావిస్తున్నాయి. ఒకవేళ వాటితో కలిసి కాంగ్రెస్‌ గట్టిగా నిలబడితే వచ్చే ఎన్నికలలో బిజెపికి ఎదురీత తప్పదు. కనుక వాటికి ఆ అవకాశం కూడా లేకుండా చేసేందుకు బిజెపి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి పక్కకు తప్పించేసింది. సుప్రీంకోర్టు దానిని కొట్టివేస్తే తప్ప రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికలలో పోటీ చేయలేరు.

కాంగ్రెస్ అధ్యక్షుడుగా మల్లిఖార్జున ఖర్గే కనిపిస్తున్నప్పటికీ, అసలు నాయకుడు రాహుల్ గాంధీయే అని వేరే చెప్పక్కరలేదు. కనుక రాహుల్ గాంధీలేని కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షాలు కలిసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఆ కూటమికి మరెవరూ తామే నాయకుడినని చెప్పుకోలేరు కనుక! ఒకవేళ చెప్పుకొన్నా కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించదు. కనుక బలమైన నాయకత్వం లేని ఆ కూటమిని ప్రజలు కూడా నమ్మబోరు. బిజెపి నమ్మనివ్వదు కూడా!

ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఏకైక ఆశాకిరణంగా ప్రియాంకా గాంధీ కనిపిస్తున్నారు. ఆమె ధైర్యం చేసి ముందుకు వచ్చి పార్టీ పగ్గాలు చేపడితే తప్ప పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాదు. మరో ఏడాదిలోగా లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక కాంగ్రెస్‌ పార్టీ అత్యవసరంగా ఈ నాయకత్వ సమస్యను పరిష్కరించుకొంటే తప్ప బలమైన కూటమి ఏర్పడలేదు. ప్రియాంకా గాంధీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చొంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది. దేశంలో బిజెపికి మరో ప్రత్యామ్నాయం ఉండదు కనుక మళ్ళీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు 2029 ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్ పార్టీ కనబడకుండా అదృశ్యమైపోయినా ఆశ్చర్యం లేదు.