kiran kumar reddyసమైక్య రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాడారు. కానీ ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ తర్వాత ఎన్నికలలో సమైక్యాంద్ర పార్టీతో ఎన్నికల బరిలో దిగి కనబడకుండా కొట్టుకుపోయారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.

తాజాగా ఆయన ఏపీ బిజెపిలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శనివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వస్తున్నారు. ఆయన సమక్షంలో బిజెపిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆయన వంటి రాజకీయ నిరుద్యోగులు కొత్తగా పార్టీలు స్థాపించడమో లేదా ఏదో ఓ పార్టీలో చేరడం సహజమే. ఆయనకు ఓ పార్టీ అండ అవసరం. ఏపీ బిజెపికి ఆయన వంటి బలమైన ఓ నేత అవసరం. కనుక ఆయన బిజెపిలో చేరినా చేరవచ్చు.

అయితే ఏపీ బిజెపికి ఇప్పుడు కావలసింది నాయకుడు కాదు… ఏపీ పట్ల చిత్తశుద్ధి! అదే…బిజెపికి లోపించింది కనుకనే పవన్‌ కళ్యాణ్‌ వంటి మిత్రుడు కూడా దూరం అవుతున్నాడు. ఏపీ సమస్యలు, దుస్థితి గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు. మూడు రాజధానులతో రగులుతున్న కార్చిచ్చును చూస్తూనే ఉంది కానీ అమరావతి రాజధానిగా కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డికి గట్టిగా చెప్పడం లేదు. ఇదివరకు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ పట్ల యూపీయే ప్రభుత్వం ఏవిదంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిదంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. కనుక ఏపీ పట్ల కేంద్రం వైఖరిలో మార్పు రానంతకాలం ఏపీ బిజెపి పగ్గాలు ఎవరు చేపట్టినా ప్రయోజనం ఉండదు.

ఇక కిరణ్ కుమార్‌ రెడ్డి విషయానికి వస్తే… ఆయన రాష్ట్ర విభజనను అడ్డుకొంటున్నట్లు నటించారు తప్ప నిజంగా అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన చివరి నిమిషం వరకు రాష్ట్ర విభజనకు అవసరమైన అన్ని ఫైల్స్ ఎప్పటికప్పుడు ఢిల్లీకి పంపిస్తూ, చకచకా విభజన జరిగేందుకు తోడ్పడ్డారు. ఆయన ప్రభుత్వ సహకారమే లేకపోతే రాష్ట్ర విభజన అంత వేగంగా జరిగేదే కాదు.

రాష్ట్ర విభజనకు ముందు యూపీయే ప్రభుత్వం లెక్కలు కట్టుకొని ఏపీ, కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా తెలంగాణలో టిఆర్ఎస్‌తో చేతులు కలిపి లాభపడవచ్చని భావించిందని కాంగ్రెస్‌ నేతలే చెప్పుకొంటున్నారు. కనుక రాష్ట్ర విభజన కోసం పోరాడుతున్న టిఆర్ఎస్‌కు అనుకూల రాజకీయ పరిస్థితులు కల్పించేందుకే కాంగ్రెస్‌ వ్యూహంలో భాగంగానే కిరణ్ కుమార్‌ రెడ్డి చేత ధర్నాల డ్రామాలు ఆడించిందని చెప్పవచ్చు. అప్పుడు కేసీఆర్‌ ఆయనని బూచిగా చూపించి ఏవిదంగా రెచ్చిపోయారో బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.

కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో, ఆంధ్రా ప్రజలతో డబుల్ గేమ్ ఆడిన కిరణ్ కుమార్‌ రెడ్డి వంటి నేతలు బిజెపికి అవసరమేమో కానీ ఏపీకి అవసరమే లేదు. అటువంటి నేతలను తెచ్చుకొనే బదులు, కేంద్ర ప్రభుత్వం ఏపీ పరిస్థితులను చక్కదిద్దితే ఏ నాయకుడు లేకపోయినా ప్రజలే బిజెపిని నెత్తిన పెట్టుకొంటారని గ్రహిస్తే మంచిది.