Commercial Moviesఎవరు కలిగించిన అభిప్రాయమో కానీ కమర్షియల్ సినిమా అంటే అధిక శాతం బిసి సెంటర్లలో ఎక్కువ వసూళ్లు తెచ్చెదనే అభిప్రాయంలో ఎందరో ఉన్నారు. అలా అయితే ఇటీవలే సంక్రాంతికి వసూళ్ల వర్షం కురిపించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలను చూసింది అనంతపూర్ దగ్గర్లోని చిన్న పట్టణంలోనే కాదు, హైదరాబాద్ పివిఆర్ మల్టీప్లెక్స్ తో మొదలుపెట్టి యుఎస్ ఐమ్యాక్స్ దాకా అన్ని చోట్ల అభిమానులు ఎగబడి చూశారు. సో క్లాసు మాస్ అనే తేడా కేవలం నటించే స్టార్లు ఎంచుకున్న కథలను ఉంటుంది తప్ప ప్రేక్షకులను బట్టి కాదని తెలుస్తోంది. కాలం ఏదైనా కావొచ్చు ఈ సూత్రీకరణలో ఎలాంటి మార్పు ఉండదు. అర్థం కావాలంటే కొంచెం లోతుగా వెళ్ళాలి.

శంకరాభరణంలో అసలు ఎలాంటి ఇమేజ్ లేని పెద్దాయన సోమయాజులు హీరో. మొదటి వారం పెద్దగా జనం లేకపోతే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఖంగారు పడ్డారు. కట్ చేస్తే మౌత్ టాక్ వల్ల ఏకంగా ఏడాది ఆడింది. సిటీ విలేజ్ అనే తేడా లేకుండా జనాలు ఎగబడి చూశారు. విజయశాంతి తప్ప ఇంకే స్టార్ అట్రాక్షన్ లేని ప్రతిఘటన బెంగళూరులో రోజు అయిదు ఆటలతో అయిదు వందల రోజులు ఆడటం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. గార్డెన్ సిటీలో ఎవరు చూశారు మరి. స్వాతిముత్యంకు ఏపీ తెలంగాణలో బోలెడు రికార్డులు భద్రంగా ఉన్నాయి. కమెడియన్ అలీ యమలీల సిల్వర్ జూబ్లీ ఆడితే రాజేంద్ర ప్రసాద్ కు ఎన్నో హండ్రెడ్ డేస్ ఉన్నాయి.

సరే ఇవన్నీ ఎప్పుడో జమానా నాటి ఉదాహరణలు అంటారా. వర్తమానానికి వద్దాం. నిఖిల్ మార్కెట్ సైజ్ ఎంత. కార్తికేయ 2తో జాతీయ స్థాయిలో ఈ కుర్ర హీరో మీద నిర్మాత పెట్టుబడికి వచ్చిన లాభమెంత. లెక్కలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. బింబిసార వచ్చినప్పుడు కళ్యాణ్ రామ్ కు గట్టి ఓపెనింగ్స్ కూడా రాలేని పరిస్థితి. కట్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు ఎప్పుడూ చూడని రిషబ్ శెట్టి అనే వ్యక్తి నటించిన కాంతారని డబ్బింగ్ రూపంలో అది కూడా పదిహేను రోజులు ఆలస్యంగా తెలుగులో రిలీజ్ చేస్తే కేవలం 2 కోట్లకు పర్సెంటేజ్ మీద పంపిణి చేసిన అల్లు అరవింద్ కు వసూళ్లు చూసి మతి పోయినంత పనైంది. ఇవన్నీ ఊర మసాలా కథలున్నవి కానే కాదు.

దీని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. కమర్షియల్ చిత్రమైనా మాస్ సినిమా అయినా కేవలం స్టార్ ఇమేజ్ ల మీద మాత్రమే ఆడేవి కావు. చెప్పే విషయం బలంగా ఉంటే అనకాపల్లి నుంచి అమెరికా దాకా అందరికీ కనెక్ట్ అవుతుంది. కాకపోతే అది యాభై కోట్లకు వెళ్తుందా రెండు వందల కోట్లను దాటడమనే విషయంలో హీరో ఇమేజ్ నిచ్చెనలా మారుతుంది. ఇక్కడా కెజిఎఫ్ లాంటి మినహాయింపులుంటాయి. పాతిక కోట్ల రేంజ్ ని చూడని యష్ ఖాతాలో పన్నెండు వందల కోట్ల బ్లాక్క్ బస్టర్ పడిందంటే దానికి కారణం తెలిసిందేగా. అభిమానులు ఊగిపోతున్నట్టు కేవలం స్టార్ల వల్ల కలెక్షన్లు కురవవు. ఇది సత్యం ఏ బాషా పరిశ్రమలో అయినా ఇదే ఎప్పటికీ నిత్యం.