Doctor-Sudhakar_Nimmagadda-Ramesh_AB-Venkateswara-Raoఆయనో ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకొంటే ఆయన అంగీకరించలేదు. వెంటనే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి ఆయనని తొలగించి ఆయన స్థానంలో తమిళనాడుకి చెందిన రిటైర్డ్ జడ్జి వి. కనకరాజుని నియమించింది. కానీ ఆయన నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. మళ్ళీ పదవి చేపట్టిన తర్వాత తన ప్రాణభయంతో హైదరాబాద్‌లో ఉంటూ విధులు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురైన ఆ అధికారి పేరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌.

ఆయన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. గత ప్రభుత్వానికి విధేయంగా పనిచేసిన నేరానికి ఏవో కుంటిసాకులతో ప్రభుత్వం రెండేళ్ళు సస్పెండ్ చేసింది. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి రెండేళ్లకు పైగా పోరాడి పదవి దక్కించుకొన్నారు. కానీ కొన్ని రోజులకే ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఆయన పేరు ఏబీ వేంకటేశ్వర రావు.

అతనో సీనియర్ వైద్యుడు… కరోనా సమయంలో రోగులకు ఎంతో సేవ చేశాడు. కానీ ప్రభుత్వం తమకి మాస్కులు, గ్లౌజులు వగైరా కూడా ఇవ్వడం లేదని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఆ తర్వాత ఆయనపై పోలీసులు కేసులు పెట్టారు. నడిరోడ్డులో బట్టలు ఊడదీసి చేతులు విరిచికట్టి మీడియా ముందు నిలబెట్టి అవమానించారు. ప్రభుత్వం ఆయనని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది. ఈ మనోవేదన భరించలేక చివరికి ఆయన చనిపోయారు. ఆయన పేరు డాక్టర్ సుధాకర్. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌లో పనిచేసేవారు.

అతనొక సాధారణ పోలీస్ కానిస్టేబుల్. ప్రభుత్వం పోలీసులకు సెలవుల బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్లకార్డు పట్టుకొని ధర్నా చేశాడు. తర్వాత సస్పెండ్ అయ్యాడు. అక్రమ సంబంధాలు, చీటింగ్ కేసుల క్రింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతని పేరు ప్రకాష్. అనంతపురం జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో పనిచేసేవాడు. అప్పటి నుంచి సస్పెన్షన్‌లోనే ఉన్నాడు.

ఆయన ఒక ఆర్టీసీ డిపో మేనేజర్. ఆర్టీసీకి చెందిన స్థలంలో వైసీపీ కార్యాలయానికి కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. అదీ… మంత్రులు శంకుస్థాపన చేస్తునప్పుడే ఇది సరికాదని వారికే చెప్పారు. రెవెన్యూ అధికారులు ఆయనపై పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆయనని కేంద్ర కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఆయన స్థానంలో వేరే వ్యక్తిని డిపో మేనేజర్‌గా నియమించారు. ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆయన స్థానంలో చీరాల డిపో మేనేజర్ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. కనుక శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగంలో నుంచి సస్పెండ్ అయినట్లే భావించవచ్చు.