YS Sharmilaవివేకానంద రెడ్డి ఆయన కూతురు, అల్లుడు హత్య చేశారని, దీని వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ నేతల వాదనలను, జగన్‌ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల నిర్ద్వందంగా నిన్న ఖండించారు. వివేక వద్ద అసలు ఆస్తులే లేనప్పుడు వారు ఎందుకు హత్య చేస్తారనే ఆమె ప్రశ్న ఆలోచింపదగ్గది.

ఇది ఆస్తి కోసం జరిగిన హత్య అని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. కానీ ఆస్తి కోసం కాదని వైఎస్ షర్మిల చెప్పడం అంటే రాజకీయహత్య అని అర్దం అవుతోంది. ఇది రాజకీయ హత్య అని ఆమె భావిస్తున్నారు కనుక ఒకవేళ దీని వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నట్లయితే ఆమె ఇంతకాలం మౌనంగా ఉండేవారే కారు. తమ రాజకీయ శత్రువైన చంద్రబాబు నాయుడుని ఈ కేసుతోనే కోలుకోలేని విదంగా దెబ్బతీసేందుకు తప్పక ప్రయత్నించేవారు. కానీ ఆమె నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు కూడా అటువంటి సందేహం వ్యక్తం చేయలేదు.

అలాగే చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపిస్తున్న వైసీపీ ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన సిట్‌ కూడా ఇది నిరూపించలేకపోయింది. సిట్‌ ప్రశ్నించినవారి జాబితాను, అది అరెస్ట్‌ చేసినవారి జాబితాలను చూస్తే ఈ విషయం అర్దమవుతుంది. అంటే అవినాష్ రెడ్డి చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే, కట్టుకధలేనని అర్దం అవుతోంది. వైఎస్ షర్మిల కూడా నిన్న అదే చెప్పారు.

దారుణంగా హత్య చేయబడిన వివేకాను, తప్పుడు ఆరోపణలతో మళ్ళీ మళ్ళీ హత్య చేయవద్దని ఆమె సూటిగానే చెప్పారనుకోవచ్చు. ఆమె అంత స్పష్టంగా చెప్పారు కనుకనే వైసీపీ నేతలు, సాక్షి మీడియా కూడా సైలెంట్ అయిపోయాయని భావించవచ్చు. బహుశః ఆమెకు ఏవిదంగా సమాధానం చెప్పి నోరు మూయించాలని అందరూ కూర్చొని ఆలోచిస్తున్నారేమో?

వైఎస్ విజయమ్మ, షర్మిల ఇద్దరూ తెలంగాణ పోలీసులను కొట్టడం, షర్మిల జైలుకి వెళ్ళిరావడం ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరమే. జగనన్నను ఇబ్బంది పెట్టడానికే వారు ఆవిదంగా చేస్తున్నారేమో అంటూ వైసీపీకి బాకా ఊదే ఓ వెబ్‌సైట్‌ అప్పుడే సందేహం వ్యక్తం చేసింది. కనుక అందుకే వైఎస్ షర్మిల పొరుగు రాష్ట్రంలో (హైదరాబాద్‌) మీడియా ముందుకు వచ్చి వివేకా హత్య గురించి ఈవిదంగా మాట్లాడి ఉండవచ్చని వైసీపీ వాదన సిద్దం చేసుకొంటోందేమో?

కనుక ఆయన హత్యపై ఈవిదంగా మాట్లాడి తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులలోకి నెడుతున్న వైఎస్ షర్మిలపై కూడా రేపు ఆత్మసాక్షిలో వ్యతిరేకంగా కధనాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆమెపై కూడా వైసీపీ నేతలు బురద జల్లడం మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.

చివరిగా ఒక్క ప్రశ్న: అవినాష్ రెడ్డిని ఈ హత్య కేసులో ఇరికించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి, సీబీఐకి ఎందుకు?ఒకవేళ ఇరికించాలనుకొంటే జగన్మోహన్ రెడ్డినే ఇరికించేవారు కదా?