DL Ravindra Reddy comments on TDPమాజీ మంత్రి డీఎల్‌ రవింద్రారెడ్డికి తెలుగుదేశం పార్టీ తలుపులు మూసేసింది. ఆయన ఆశించిన మైదుకూరు టిక్కెట్టును పుట్టా సుధాకర్ యాదవ్ కు ప్రకటించి డీఎల్ ను నిరాశపరిచింది. దీనితో ఆయన ఆగ్రహంగా ఉన్నారు. కార్యకర్తల సమావేశం పెట్టి ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘ఈ వయస్సులో పార్టీల చుట్టూ తిరగడం చూస్తే సిగ్గుగా ఉంది. 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎందరికో బీఫారం ఇప్పించిన మనిషిని. ఇప్పుడు నా బీఫారం కోసం టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీల దగ్గరకు పోవడం సిగ్గుచేటుగా ఉంది’’ అని అన్నారు.

“మాలాంటి నేతల సేవలు ఉపయోగించుకుంటే జిల్లాలో టీడీపీని కూకటివేళ్ళతో పెకలిస్తాం,” అని డీఎల్‌ రవింద్రారెడ్డి చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇచ్చారు. ఒకపక్క డీఎల్ తనకు టిక్కెట్టు ఇచ్చే పార్టీ లేకుండా పోయింది అంటూ ఇంకో పక్క టీడీపీని కూకటివేళ్ళతో పెకలిస్తాం అనడం కొంత అతిశయోక్తిగానే ఉంది. టీడీపీలో తలుపులు మూసుకుపోయినట్టే అని డీఎల్‌ మాటల్లో కనిపించింది. ఇక వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుంచి పిలుపు వస్తే చేరతారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

1978 నుండి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు డీఎల్. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా ఆయన కాంగ్రెస్ తరపున గెలిచారు. 1978 నుండి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలలో నాలుగు సార్లు మాత్రమే .. 1985, 1999, 2014 ఎన్నికలలో మాత్రమే ఆయన ఓడిపోయారు. మర్రి చెన్నా రెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ల లో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆయన ప్రభావం తగ్గిపోయింది. యాక్టీవ్ పాలిటిక్స్ కు దాదాపుగా దూరం అయిపోయారు.