Discussion On Drugs In Tollywoodదేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రమేయముందని భావిస్తున్న ముగ్గురు తెలుగు హీరోయిన్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఎవరెవరికి నోటీసులు పంపామన్న విషయాన్ని వెల్లడించకున్నా, వీరంతా సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని ఎక్సైజ్ ఈడీ అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే పది మంది సినీరంగంలోని వారికి నోటీసులు ఇచ్చామని చెప్పిన ఆయన, నేడు ముగ్గురు హీరోయిన్లకు, మరో టాప్ డైరెక్టరుకు కూడా నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. వీరంతా 19న సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి వుంటుందని, లేకుంటే పోలీసు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

విశ్వసనీయ పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు… బాల నటుడిగా కెరీర్ ను ప్రారంభించి హీరోగా విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రస్తుతం చేతుల్లో సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉన్న ఓ యువ నటుడికి డ్రగ్స్ దందాలో ప్రధాన పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇతనితో పాటు ఓ వర్ధమాన గాయకురాలి భర్తకు మరియు సినిమా ఫంక్షన్లు జరిగితే హీరోలను ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలు గుప్పిస్తుండే ఓ నిర్మాత (ఎన్నో సినిమాల్లో చిన్నా, పెద్ద పాత్రలు పోషించాడు), అలాగే సినిమాల్లో తొలుత హీరోగా ప్రవేశించి, ఆపై సరైన బ్రేక్ లు రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ యువ నటుడు ఉన్నారు.

అమెరికా నుంచి వచ్చి తొలుత హిట్ చిత్రాల్లో నటించి, ఆపై ప్రస్తుతం అడపాదడపా కనిపిస్తున్న నటుడికి, సినిమాలు వేగంగా తీస్తాడని పేరు తెచ్చుకున్న ఓ టాప్ డైరెక్టరు ఈ జాబితాలో ఉన్నారు. ఇక హీరోయిన్ల జాబితాకు వస్తే… అటు టీవీ తెరపై, ఇటు వెండితెరపై రాణిస్తున్న ఓ నటి, అటు సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు స్టేజ్ షోలు, న్యూ ఇయర్ పార్టీల్లో సందడి చేస్తుండే నటి, డైరెక్టర్లతో క్లోజ్ గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలను కూడా చూసే ఓ హీరోయిన్ ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరి పేర్లను బయట పెట్టేందుకు తమకు అనుమతులు లేవని చెబుతూనే, వారి బయోడేటాలను పోలీసు వర్గాలు బహిర్గతం చేస్తున్నాయి.

గత కొంతకాలంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డ ఓ సెన్సేషనల్ నిర్మాత ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆపై ముంబైలో నివాసం ఉంటూ, తెలుగు చిత్రాల్లో పలు ఐటమ్ సాంగ్స్ చేసిన హాట్ బాంబ్ కు కూడా సిట్ పోలీసుల నుంచి నోటీసులు వెళ్లినట్టు సమాచారం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, ఆపై ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఉన్న ఓ హీరోయిన్, తన అద్భుత గానంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం రాక్ స్టార్ గా వెలుగుతున్న ప్రముఖ గాయకుడికి కూడా సిట్ నోటీసులు పంపి ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు వంటి ప్రముఖులు ప్రెస్ మీట్ పెట్టారంటేనే ఈ విషయం టాలీవుడ్ లో ఎంత సీరియస్ గా మారిందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఎవరెవరు చిక్కుకున్నారో కూడా అంచనాలు వేయవచ్చు.