Director-Vishwanath-at-Venkaiah-Naidu--residenceదాదాపు సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్ దంపతులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దంపతులు ఢిల్లీలోని తమ నివాసంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, బీజేపీ నేత, సీనియర్ నటుడు కృష్ణంరాజు, నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ…

“మన వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా, మన భారతీయ సంస్కృతీ సంప్రదాయలు, కుటుంబ వ్యవస్థ ఇలాగే కొనసాగాలనే విషయంలో విశ్వనాథ్ గారు చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేము… ఆయన సినిమాల్లో జుగుప్ప, హింస, డ్యూయెట్లు… లేకపోయినా హిట్ అవడానికి కారణం నేటివిటీ. మన సంస్కృతికి దర్పణం పట్టే విధంగా, భారతీయ జన జీవానికి దర్పణం పట్టేట్టుగా వాస్తవ పరిస్థితులను చూపించారు. సినిమా అనేది ఊహల్లో విహరింపజేస్తుంది, వాస్తవానికి కొద్దిగా దూరంగా ఉంటుంది. అలా కాకుండా, వాస్తవానికి దగ్గరగా విశ్వనాథ్ గారి సినిమాలు ఉంటాయి. నేటి తరానికి ఆదర్శప్రాయుడు” అంటూ కళాతపస్వి గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ… నాలుగు రోజులుగా పెద్ద తుఫాన్ వచ్చినట్టు అయిపోయింది. ఎంతో మంది, అభినందించడానికి వచ్చారు… శాలువాలు కప్పారు… దండలు వేశారు. కానీ ఎన్ని దండలు చూసినా, ఏ పూలు చూసినా… ఒక్కటీ ఆ పూల వాసన కొట్టలేదు… వెంకయ్యనాయుడు గారు వేసిన గులాబీ దండ మాత్రం గులాబీల వాసన వస్తోంది… ఈ అవార్డు వచ్చినందుకు మీ స్పందన ఏమిటి? అని చాలామంది అడుగుతారు. ఇలాంటి సందర్భం ఒకటి నేను తీసిన సినిమాలో ఉంటుంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు… అనుభూతి ఏంటనేది చిన్న లయ ద్వారా ఆ రచయిత చెబుతాడు.

‘అందెల రవమిది పదములదా… అంబరమంటిన ఎద సొదదా…’ నేను ఎందుకని ఇలాంటి సినిమాలు తీయగలిగాను? ఈ కోవలోను ఎందుకు తీయగలిగాను? నేను మాత్రం డబ్బుకు లొంగిపోలేదా, ప్రలోభం లేదా? నాకు మాత్రం కమర్షియల్ గా పేరు తెచ్చుకోవాలని లేదా? అంటే నేను పెంచబడిన పెంపకం అలాంటిది. ఒక లోయర్ మిడిల్ క్లాసు నుంచి వచ్చిన నేను, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేమిటంటే… ‘మాతృదేవోభవ పితృదేవోభవ అతిథిదేవోభవ ఆచార్య దేవోభవ’ అనేది బాగా జీర్ణించుకుపోయేట్టుగా మా తల్లిదండ్రులు ఉగ్గుపాలతో పట్టారు.

ఇంకో కాన్సప్ట్ ఏంటంటే… ‘గురుబ్రహ్మ గురు విష్ణు, గురుదేవో మహేశ్వర:..గురు సాక్షాత్తూ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవేనమ:’, ‘సర్వేజనా సుఖినోభవంతు…’ ఈ మూడు సమపాళ్లలో కనుక జీర్ణించుకుపోతే మన దృష్టి హింస మీదకు కానీ, మరీ దేనిమీదకు కానీ పోదు…. ఒక్కమాట మాత్రం నేను నమ్ముతాను. భగవంతుడిని నమ్ముకుంటే మాత్రం ఆలస్యం చేస్తాడేమో కానీ, అన్యాయం మాత్రం చేయడని గట్టి నమ్మకం’ అంటూ తన భావాలను, అనుభూతులను తనదిఅన శైలిలో పలికించారు కళాతపస్వి విశ్వనాథ్.