Balagam_Movie_Controversyసినిమాలకు కథలు రాసుకునే రచయితలు దర్శకులు ఎక్కడి నుంచో స్ఫూర్తి పొందటం లేదా కాపీ కొట్టడం మాములే. ఇదేమి కొత్త కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. కాకపోతే ఒకప్పుడు ఈ తతంగం బయటికి తెలిసేది కాదు. సోషల్ మీడియా లేని కాలంలో టెక్నాలజీ ఊసే లేని రోజుల్లో ఫలానా విదేశీ చిత్రం నుంచి సీన్లో ఇంకేవో ఎత్తుకొస్తే ఎవరూ గుర్తు పట్టేవారు కాదు. హాలీవుడ్ నిర్మాణ సంస్థలు తమ క్రియేటివిటీని భారతదేశంలో చౌర్యం చేస్తున్నారని తెలిసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. దాని వల్ల కలిగే ప్రయోజనం కన్నా ప్రయాస ఎక్కువగా ఉండటం కారణం. అందులోనూ మన నేటివిటీకి తగ్గట్టు చాలా తెలివిగా మార్పులు చేసుకునేవారు

తాజాగా తెలంగాణ నేపథ్యంలో వచ్చి ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్న బలగం స్టోరీ మీద గత రెండు రోజులుగా వివాదం నెలకొంది. గడ్డం సతీష్ అనే పాత్రికేయుడు ఇది ఎప్పుడో ఓ పత్రికకు తాను రాసిన కథని మార్పులు చేర్పులు చేసి వాడుకున్నారని ఏకంగా మీడియా ముందుకొచ్చి పేరు వేయకపోతే కోర్టుకు వెళ్తానని హెచ్చరించాడు. దీనికి బదులుగా దర్శకుడు వేణు యెల్దెండ్ల సమాధానమిస్తూ తాను చూపించిన పెద్ద కర్మ కాన్సెప్ట్ శతాబ్దాల నాటిదని దాని మీద ఎవరికీ హక్కులు ఉండవని, దిల్ రాజుని అనవసరంగా లాగినందుకు తాను కూడా లీగల్ గా చూసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.

సరే ఈ కాంట్రావర్సి ఎక్కడ తేలుతుందనేది పక్కన పెడితే ఇవి టాలీవుడ్ కు కొత్త కాదు. ఆచార్య షూటింగ్ జరుగుతున్న టైంలో ఓ యువ రచయిత ఎంత రాద్ధాంతం చేశాడో న్యూస్ ఛానల్స్ లో చూశాం. కొరటాల శివ కౌంటర్ ఇవ్వడం తర్వాత అదెందుకో సద్దుమణగడం జరిగిపోయింది. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి టైంలోనూ ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి. నేనే రాజు నేనే మంత్రి రిలీజ్ అయ్యాక ఇదే తరహా గొడవ వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. కానీ తర్వాత అదేమంత హైలైట్ కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వందల్లో ఉదాహరణలు ఉన్నాయి.

ఇకపై ఇలాంటివి ఆగిపోతాయన్న గ్యారెంటీ లేదు. కాకపోతే మీడియా విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఈ తరహా వివాదాలు రేగినప్పుడు వీటిని ఎదురుకుంటున్న వాళ్ల వైపు నిజాయితీ ఉంటే తప్ప డిఫెన్స్ చేసుకోవడం కష్టం. లోలోపల సెటిల్ మెంట్లు చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. చాలాసార్లు అలా పరిష్కారమయినవే ఎక్కువ. ఇప్పుడు బలగం విషయంలో తప్పు ఎవరిదైనా ఇది రెండు మూడు రోజుల టాపిక్ అంతే. సాగదీసే దాకా వెళ్లదు. ఆ మాటకొస్తే కన్నడ తిథి నుంచి వేణు పాయింట్ తీసుకున్నాడన్న కామెంట్లు లేకపోలేదు. కానీ పూర్తిగా అయితే కాదు. సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కాల్సిన తరుణంలో రైటర్స్ డైరెక్టర్స్ జాగ్రత్తగా ఉండకపోతే ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి