director Sukumar about Ram Charan Action on rangasthalam-నటుడిగా రామ్ చరణ్ కు ఎన్ని మార్కులు వేస్తారు? అంటే ఇప్పటివరకు విడుదలైన సినిమాలను బట్టి అయితే బహుశా జస్ట్ పాస్ మార్క్ స్థాయిలో ఉంటుందేమో తప్ప, విమర్శకుల ప్రశంసలు అందుకునే రేంజ్ కాదన్నది బహిరంగ సత్యమే. అలాంటి రామ్ చరణ్ తప్ప మరోక హీరోను ‘రంగస్థలం’లో ఊహించుకోలేము అంటూ దర్శకుడు సుకుమార్ చెప్పిన కాన్ఫిడెన్సును చూస్తుంటే… అంతలా చెర్రీ మెస్మరైజ్ చేస్తాడా? అనేది ఆశ్చర్యంగా ఉంటోంది.

నిజమే… గతంలో చెర్రీ నటనకు ఆస్కారం ఉన్న పాత్రల కంటే బాక్సాఫీస్ వద్ద సినిమా కమర్షియల్ స్టామినా ఉన్న పాత్రలనే ఎంచుకున్నారు. అందుకే చెర్రీ నటనపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ‘రంగస్థలం’ అలా కాదన్న విషయాన్ని దర్శకుడు సుకుమార్, చిరంజీవిలతో పాటు ధియేటిరికల్ ట్రైలర్ కూడా స్పష్టం చేసింది. సుకుమార్ చెప్పినట్లుగా… ఈ సినిమాలో రామ్ చరణ్ ను తప్ప మరొక హీరోను ఊహించుకోలేనంతగా చెర్రీ కనిపిస్తున్నాడు.

విడుదలకు ముందు ఉన్న ఈ అభిప్రాయమే, రిలీజ్ తర్వాత కూడా ఏర్పడితే నటుడిగా చెర్రీకి ‘ఆస్కార్’ లభించినట్లే! ఇప్పటివరకు తిట్టిన వారే ప్రశంసలు కురిపిస్తారని చెప్పడంలో సందేహం లేదు. సహజంగా సుకుమార్ సినిమాలో హీరోలకు కొత్తగా అభినయించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ‘రంగస్థలం’ రూపంలో రామ్ చరణ్ కు ఆ అవకాశం అవకాశం లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటే, బాక్సాఫీస్ ఫలితాలతో నిమిత్తం లేకుండా చెర్రీ మరో మెట్టు పైకి ఎదిగినట్లే!

అందులోనూ ఈ ట్రైలర్ కు యూనివర్సల్ గా పాజిటివ్ స్పందన రావడంతో ఓపెనింగ్స్ విషయంలోనూ సరికొత్త రికార్డులు అందుకునే సౌలభ్యం ఉంది. ‘రంగస్థలం’ విడుదలయ్యే నాటికి బాక్సాఫీస్ వద్ద మరే పెద్ద చిత్రం లేకపోవడం కలిసివచ్చే అంశం. ప్రస్తుతానికి స్టేజ్ అంతా సెట్ చేసి ఉంది… ఇక తమ ‘రంగస్థలం’తో రామ్ చరణ్ అండ్ కో దున్నేయడమే మిగిలి ఉంది! అదే జరిగితే… చెర్రీ బ్యాక్ టు రేస్… అని ఖచ్చితంగా చెప్పవచ్చు.