మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “రోగ్” సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న పూరీ జగన్నాథ్, తన భవిష్యత్తు సినిమాల గురించి చెప్పుకొచ్చారు. బాలకృష్ణతో తెరకెక్కించబోయే సినిమాలో గ్యాంగ్ స్టర్ గా బాలయ్య కనిపించనున్నారని, అలాగే చిరంజీవితో సినిమా చేయాలన్న తన కోరిక నెరవేరుతుందని భావిస్తున్నానని, ఇటీవల కూడా చిరంజీవిని ఓ సారి కలిసానని పూరీ చెప్పుకొచ్చారు.
ఇక, ప్రిన్స్ మహేష్ బాబుతో తీయాలనుకున్న “జనగణమన” సినిమాపై స్పందిస్తూ… సందేశాత్మక కోణంలో వైవిధ్యభరితంగా ఈ సినిమా ఉంటుందని, మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ అన్న పూరీ, ఈ సినిమా భిన్న భాషల కలయికలో ఉంటుందని, తప్పకుండా ఈ సినిమాను మహేష్ బాబుతో చేస్తానని, తానూ దర్శకత్వం వహించిన సినిమాలలో ‘బిజినెస్ మెన్, నేనింతే’ సినిమాలు బాగా ఇష్టమని చెప్పుకొచ్చారు పూరీ.
దీంతో మరుగున పడిపోయిందని భావిస్తున్న “జనగణమన” స్క్రిప్ట్ ఇంకా అలాగే ఉందని తెలిసి వచ్చింది. అలాగే ఆ సినిమాను మహేష్ తోనే తీస్తానని మరోసారి స్పష్టం చేయడంతో, ‘జనగణమన’ సినిమా మహేష్ నుండి ఇంకా దూరం కాలేదని అర్ధమవుతోంది. ఇటీవల ఈ సినిమాను మరో అగ్ర హీరోతో తెరకెక్కించడానికి పూరీ సన్నాహాలు చేసుకుంటున్నారు అన్న టాక్ హల్చల్ చేయగా, తాజా పూరీ కామెంట్స్ తో ఓ స్పష్టత వచ్చేసింది.