Director-Maruthi comments on social media handlers‘ఈ రోజుల్లో, బస్టాప్, రొమాన్స్’ వంటి సినిమాలతో బూతు చిత్రాల దర్శకుడిగా పేరు గడించిన మారుతీకి, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో కెరీర్ మరో టర్నింగ్ పాయింట్ తిరిగింది. అయితే తాను తీసింది బూతు చిత్రాలు అవునో, కాదో గానీ సోషల్ మీడియాలో వస్తున్న బూతులు మాత్రం అనన్య సామాన్యం అంటున్నారు మారుతీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్విట్టర్ మరియు సోషల్ మీడియా యూజర్లను చీల్చిచెండాడే విధంగా వ్యాఖ్యానించారు మారుతీ.

ఈ సోషల్ మీడియా యూజర్లకు నెగటివ్ యాటిట్యూడ్ బాగా పెరిగిపోయిందని, అవతల వ్యక్తిలో ఏం లోపాలు ఉన్నాయన్నదే చూస్తున్నారు, దానికి తోడూ నెగటివ్ టైటిల్ పెడితే గానీ ఆడియన్స్ కూడా క్లిక్ చేయని పరిస్థితులు ఉన్నాయని, కానీ అది పోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి అని కోరుకుంటున్నానని, అలాంటి సంస్కృతి రావాలని అంటున్నానని మారుతీ అభిప్రాయపడ్డారు. మనం తిట్టినా వీడు పైకి ఎదుగుతాడు అంటే వాడ్ని పోగుడుతావు, లేదు వాడు చచ్చిపోతున్నాడు అంటే ఇంకా చంపేస్తున్నారు అంటూ నెటిజన్లను ఏకిపారేసాడు.

తెలుగులో బూతులు తప్పించి అన్ని రకాలుగా తిడుతున్నారు… ఇక మున్ముందు అసభ్య పదజాలం కూడా అలవాటవుతుంది… ఇంకా అలవాటయ్యే కొద్ది ఆ ఒరవడి పెరుగుతుందే తప్ప ఏం ఉపయోగం ఉండదని, అదీ కాక మరో పది మందికి వాటిని అలవాటు చేసినట్లే అవుతుందని తనదైన శైలిలో సూచనలతో కూడిన హెచ్చరికలు చేసారు మారుతీ. నేను ఓ లక్ష ట్వీట్లు చేసారు, 50 వేల మెస్సేజ్ లు ఇచ్చాను చెప్పుకునే కాలం వస్తుందనే విధంగా సమాజం సాగుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసారు.

నిజానికి మారుతీ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. టైటిల్ లో విషయం పెట్టి చదవండి అంటే ఏ ఒక్కరూ చదవని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మారుతీ అన్నట్లు టైటిల్ ‘స్పైసీ’గా ఉంటేనే వీక్షకుడు దానిని క్లిక్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే నెగటివ్ రాస్తేనే వాటికి తగినన్ని క్లిక్స్ దక్కుతున్నాయి. మరి ఈ పోకడ ఎప్పుడు మారుతుందో గానీ, మారుతీ వ్యంగ్యాస్త్రాలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే తాను మాత్రం అసలు ఎలాంటి కామెంట్స్ చదవను అని కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు మారుతీ. మరి ఏం చదవకపోతే ఇవన్నీ ఎలా తెలిసాయబ్బా..!