Director Krish responds to Gautamiputra Satakarni rumours“గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాలో అసలు చరిత్రను వక్రీకరించారంటూ… ఈ సినిమా కధపై చరిత్రకారులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో కల్పితాలు పెట్టుకోవచ్చని… కానీ అదే చరిత్ర అంటే చూస్తూ ఊరుకోవాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విమర్శలపై చిత్ర దర్శకుడు క్రిష్ తీవ్రంగా మండిపడ్డారు. “తాను చేసిన ఓ గొప్ప ప్రయత్నాన్ని కించపరిచేలా వారు వ్యవహరిస్తున్నారని… అలాంటి వారి వ్యాఖ్యల పట్ల తాను స్పందించనని” అన్నారు.

అయితే ఏమీ తెలియకుండా కళ్లు మూసుకుని సినిమా తీయలేదని, స్క్రిప్ట్ రాసేటప్పుడు ఐదు పుస్తకాలను చదివానని… వాటిలో పలు రకాలుగా శాతకర్ణి కధ గురించి తెలిపారని… వాటన్నిటితో పాటు, చదువుకునే రోజుల్లో తాను చదువుకున్న దాన్ని కూడా మిళితం చేసి ఈ కథను తయారు చేసుకున్నానని చెప్పారు. తనను విమర్శించే వాళ్లవన్నీ నిరాధార ఆరోపణలని, నిజంగా విమర్శలు చేస్తున్న వారు కూడా సినిమాలు తీసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు చక్రవర్తుల్లో ఒకరని విశ్వనాథ సత్యనారాయణ చెప్పారని… వారి కన్నా తనను విమర్శించేవారు ఎక్కువా? అని ప్రశ్నించారు. తెలుగు జాతిని గర్వపడేలా చేసిన నందమూరి తారక రామారావు కూడా ఈ సినిమా చేయాలనుకున్నారని… ఆయన నిజంగా తెలుగు చక్రవర్తి కాకపోతే ఎన్టీఆర్ ఆ సినిమా చేయాలనుకుంటారా? అంటూ నిలదీశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా… సినిమాకు మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపారు క్రిష్.