director Kodandarami Reddy House Maid Suicideఒక సాధారణ చిరంజీవి కాస్త ‘మెగాస్టార్’ చిరంజీవిగా మారడానికి ప్రధాన కారణమైన దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంట్లో ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత సినీ ప్రపంచానికి దూరంగా, తన కొడుకుని హీరోగా తీర్చిదిద్దే పనిలో ఉన్న సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి ఇంట్లో పనిచేస్తున్న తూర్పు గోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన 19 ఏళ్ళ యువతి జయశ్రీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… గత సంవత్సరం నుంచి సదరు యువతి కోదండరామిరెడ్డి ఇంటి ఆవరణలోనే ఓ గదిలో ఉంటూ పని చేస్తోంది. గత నెలలో స్వగ్రామానికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు తన తల్లి నాగమణిని కూడా తీసుకొచ్చింది. వారిద్దరూ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, తల్లి బయటకు వెళ్లి వచ్చే సరికి, తమ గదిలో కుమార్తె ఉరి వేసుకుని మరణించింది.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తన తల్లితో పని చేయించడం ఇష్టం లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ అసలు వాస్తవం ఏంటనేది బయటకు రానుంది. ఈ కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.