director kishore kumar pardasani‘ధృవ’ సినిమా విడుదలైన అనంతరం… ‘ఇకపై రీమేక్ లు చేయను, నా జీవితంలో ఇదే చివరి రీమేక్ చిత్రం’ అని ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. దానికి గల కారణాలు కూడా అప్పట్లో సురేందర్ రెడ్డి చెప్పారనుకోండి. కట్ చేస్తే… ‘కాటమరాయుడు’ విడుదలైన అనంతరం… తాజాగా ఈ చిత్ర దర్శకుడు కిషోర్ పార్ధసాని (డాలీ) చెప్పిన మాట… ఇప్పటికే మూడు రీమేక్ సినిమాలు చేశాను, ఇకపై రీమేక్ లు చేయదలుచుకోలేదు.

‘గోపాల గోపాల’ తర్వాత తనతో ఓ సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన అనంతరం, ఓ నాలుగు నెలల సమయం ఇస్తే స్క్రిప్ట్ తీసుకువచ్చి చెప్తానన్నానని, అయితే ఈ లోపుగా పవన్ నుండే కబురు వచ్చిందని, ‘వీరమ్’ సినిమాలో కమర్షియల్ అంశాలు నచ్చి పవన్ రీమేక్ చేయాలనుకున్నారని, అయితే దానిని వీలైనంతగా తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చామని, ఇకపై మాత్రం ఫ్రెష్ స్క్రిప్ట్ లను మాత్రమే చేస్తానని తన మదిలోని ఆంతర్యాన్ని స్పష్టం చేసారు డాలీ.

అయితే అటు సురేందర్ రెడ్డి గానీ, ఇటు డాలీ గానీ ఆయా సినిమాలకు ఫ్రెష్ నెస్ నే తీసుకురావడంలో సక్సెస్ సాధించారు గానీ, బాక్సాఫీస్ బరిలో నిలిచే అవకాశాలను మాత్రం అందించలేకపోయారు. ‘కాటమరాయుడు’ ఫస్ట్ డే పరవాలేదనిపించినా, ఆ తర్వాత క్రమంగా కలెక్షన్స్ డ్రాప్ అవుతూ, నాలుగవ రోజైన సోమవారం నాడు దారుణ స్థితికి చేరుకున్నాయనేది ట్రేడ్ టాక్. దీనికి తోడు రెండవ రోజు నుండే సినిమా పైరసీ బారిన పడడం, ఫేస్ బుక్ లో కూడా సినిమా అందుబాటులో ఉందన్న ఫిర్యాదులు రావడం కలెక్షన్లపై ప్రభావం చూపాయనే చెప్పాలి.