Harish Shankarఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఏ దర్శకుడైనా గొప్పగా తీయాలని తాపత్రయపడతాడు. తన వంద శాతం కష్టాన్ని పణంగా పెడతాడు. అలా చేసినప్పుడే గొప్ప ఫలితాలు వస్తాయి. అది రీమేక్ అయినా స్ట్రెయిట్ మూవీ అయినా ఇదే వర్తిస్తుంది. చేతికొచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని ఎవరూ పాడు చేసుకోరు. ఫలితంతో సహా అన్నీ మన చేతుల్లో లేకపోయినా వీలైనంత వరకు తన లోపమేమీ లేకుండా చూసుకుంటాడు. అందులో హరీష్ శంకర్ ఒకరు. సల్మాన్ హీరోగా దబాంగ్ అనే చిత్రం బాలీవుడ్ లో పెద్ద హిట్టు. ఎంత సక్సెస్ అయినా అందులో తెలుగు ఆడియన్స్ కి హై అనిపించే మూమెంట్స్ తక్కువే. అందుకే రీమేక్ ఎవరు చేయరులే అనుకున్నారు.

తీరా చూస్తే ఒక ఫ్లాపు ఒక సూపర్ హిట్టు అనుభవమున్న హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ ఎస్ చెప్పినప్పుడు అందరూ షాక్ తిన్నారు. కట్ చేస్తే రిలీజయ్యాక చూస్తే పవన్ ఫ్యాన్స్ మతులు పోయాయి. కలెక్షన్లు పోటెత్తాయి. ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లు సైతం ఇలా కూడా మార్పులు చేయొచ్చా అని ఆశ్చర్యపోయారు. చూస్తే పవన్ కెరీర్ హయ్యెస్ట్ నమోదయ్యింది. ఇది మాస్ పల్స్ మీద పట్టున్న ఒక డైరెక్టర్ క్రియేటివిటీ. సర్దార్ గబ్బర్ సింగ్ ని వేరొకరు చేస్తే ఏమయ్యిందో అంత ఈజీగా మర్చిపోగలమా. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబో సాధ్యపడింది. ఆలస్యమైనా సరే పట్టాలెక్కింది. కానీ ముందు చెప్పిన భవదీయుడు భగత్ సింగ్ కాస్తా బిరుదు మారి ఉస్తాద్ అయ్యాడు.

ఇది తేరి రీమేక్ అనే సందేహమే కానీ నిజంగా అదేనా కాదా అనేది నిర్మాతలతో సహా ఎవరు చెప్పలేదు. ఎలాంటి ఆధారమూ లేదు. కానీ పవన్ అభిమానులు కొందరు ట్విట్టర్ లో చేసిన అతి హద్దులు దాటిపోయింది. ఎంతగా అంటే హరీష్ శంకర్ ఏదో చేయరాని నేరం చేసినట్టు, అసలు రీమేక్ చరిత్రలో ఇదే మొదటిసారి అయినట్టు రకరకాలుగా టార్గెట్ చేశారు. నిజానికి గద్దలకొండ గణేష్ తర్వాత ఏళ్లకేళ్లు కరిగిపోతున్నా ఇంకే ప్రాజెక్టు ఒప్పుకోకుండా హరీష్ ఎదురు చూసింది పవన్ కోసమే. తేరి రీమేకే చేయమని పవన్ అడిగినా ఎందుకు నో అంటారు. గబ్బర్ సింగ్ కి మించిన ట్రీట్ మెంట్ ఇచ్చి గూస్ బంప్స్ ఇచ్చే స్టఫ్ ని ప్రెజెంట్ చేస్తారు. చేస్తోంది అదేగా .

అలాంటప్పుడు హరీష్ ని లక్ష్యంగా పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అసలు స్టార్లను డీల్ చేయడంలో అనుభవమే లేని సాగర్ చంద్రనే భీమ్లా నాయక్ ని మెప్పించేలా తీయగలిగినప్పుడు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్ నుంచి పొరపాట్లు ఎలా జరుగుతాయి. హరీష్ చెబుతోంది ఈ విషయమే. అయినా ట్విట్టర్ వేదికగా జరిగిన రాద్ధాంతం చూసి అసలు ఇంకేమి చెప్పను నేరుగా థియేటర్లలోనే చూడండి అర్థమవుతుందని తేల్చేశారు. ఒకరకంగా ఇదే మంచిది. ఒప్పేసుకున్నా ఒప్పుకోకపోయినా రచ్చ ఆగనప్పుడు అదేదో నేరుగా సినిమా రూపంలోనే సమాధానం చెప్పడం కరెక్ట్. ప్లానింగ్ ప్రకారం షెడ్యూల్స్ జరిగితే 2024 సంక్రాంతి విడుదలకి ప్లాన్ చేస్తున్నామని హరీష్ చెప్పేశారు.