Director Harish Shankar not compromising on controversy ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా నుండి విడుదల చేసిన రెండవ పాట (గుడిలో మదిలో ఒడిలో)లోని కొన్ని పదాలను బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శివుడ్ని కొలిచే ‘నమకం, చమకం’ వంటి కొన్ని పదాలను, శృంగార భరితంగా వినియోగించారంటూ మండిపడుతున్నారు. ఈ పదాలను తొలగించి, వెంటనే క్షమాపణ చెప్పని పక్షంలో ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమాను విడుదల కానివ్వబోం అంటూ ఓ పక్కన బ్రాహ్మణ సంఘాలు చేస్తుండగా, దీనిపై ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు.

తాను ఓ వైదిక బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చానని, అలాంటి తాను ఎందుకు బ్రాహ్మణులను అవమాన పరిచేలా సినిమా తీస్తానని, అయినా మా సినిమాలో బ్రాహ్మణుడ్ని హీరోయిజంగా చూపిస్తున్నామే తప్ప తప్పుగా చూపించడం లేదని వివరణ ఇచ్చుకున్నారు. “బ్రాహ్మణుడు తలచుకుంటే యుద్ధమైనా చేయగలడు, యజ్ఞం అయినా చేయగలడు” అనే థీమ్ తో ఈ సినిమా చేస్తున్నామని, అయినా 60, 70 కోట్లు ఖర్చు పెట్టి ఒక సామాజిక వర్గాన్ని అవమానపరిచే ఉద్దేశం తనకు గానీ, నిర్మాత దిల్ రాజుకు గానీ లేదని స్పష్టం చేసిన హరీష్ శంకర్ స్పష్టం చేసారు.

తాను ప్రస్తుతం అదే సినిమాలోని పాట షూటింగ్ లో బిజీగా ఉన్నానని, సమయం వచ్చినపుడు తప్పనిసరిగా దీనిపై వివరణ ఇస్తానని, ప్రస్తుతం అంత సమయం లేదని, తమ పాటలోని పదాలను బ్రాహ్మణ సంఘాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని, సమయం వచ్చినపుడు వారికి వివరించే ప్రయత్నం చేస్తామని అన్న హరీష్, ఆ పాటలోని అభ్యంతరాలు ఉన్న లైన్లను తొలగించే ఉద్దేశం లేదని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. వివాదం పుణ్యమా అంటూ ఓ రెండు విషయాలైతే హరీష్ స్వయంగా వెల్లడించేసారు. అందులో ఒకటి ఈ సినిమా ‘థీమ్’ కాగా, మరొకటి సినిమా బడ్జెట్.