Gopichand Malineniఎంత సంక్రాంతి సీజనైనా అపోజిషన్ లో బలమైన ఎంటర్ టైన్మెంట్ సినిమా ఉన్నప్పుడు ఇటుపక్క సీరియస్ ఫ్యాక్షన్ డ్రామాతో మెప్పించడం అంత సులభం కాదు. వీరసింహారెడ్డికి మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది నిజమే. రివ్యూలు సైతం పర్లేదన్నాయి తప్పించి సూపరనే మాట వినిపించలేదు. అయినా కూడా కలెక్షన్లు భారీగా వచ్చాయి. అఖండ ఫుల్ రన్ ని రెండు వారంలోకి అడుగుపెట్టేయడం ఆలస్యం ఆ మార్కుని దాటేయడమంటే మాటలు కాదు. కనీసం ఇంకో రెండు వారాలకు పైగా డీసెంట్ రన్ ఖచ్చితంగా ఉంటుంది.

ఒకప్పుడు బాలకృష్ణ సినిమాకు బ్యాడ్ లేదా సోసో టాక్ వస్తే దాని ప్రభావం రెండో రోజే విపరీతంగా కనిపించేది. ఒక్క మగాడు, పరమవీరచక్ర లాంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వసూళ్లు పడిపోయి మళ్ళీ రికవరీ అయ్యేవి కాదు. ఇది చాలా ఏళ్ళు జరిగింది. దానికి తోడు బోయపాటి శీను తప్ప బాలయ్యలోని అసలు మాస్ ని ఎవరూ పూర్తిగా వాడుకోలేరన్న కామెంట్ ని నిజం చేస్తూ దర్శకులందరూ ఫెయిల్ అవుతూ వచ్చారు. ఎట్టకేలకు గోపీచంద్ మలినేని దానికి చెక్ పెట్టి నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు.

వీరసింహారెడ్డిలో పెద్ద పాత్రను మలిచిన తీరు, ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన ఎలివేషన్లు ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ఆ హైఎండ్ హీరోయిజం ఇంటర్వెల్ కే ముగించేయడంతో సెకండ్ హాఫ్ సిస్టర్ సెంటిమెంట్ చివరి ఇంప్రెషన్ మీద ప్రభావం చూపించింది. ఫలితంలో అనుకూలత తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు. లెజెండ్, సింహా తదితర చిత్రాల్లో ఉన్న హైవోల్టేజ్ యాక్షన్ ఇందులో కొంత మిస్ కావడం అసంతృప్తికి కారణమయ్యిందన్న కోణాన్ని కాదనలేం.

ఇవన్నీ పక్కనపెడితే బాలయ్యని రిసీవ్ చేసుకునే విధానం ప్రేక్షకుల్లో మారిందనడానికి వీరసింహారెడ్డి సాధించిన డెబ్భై కోట్లకు పైగా షేరే సాక్ష్యం. అఖండకు దక్కిన ఆదరణ. అన్ స్టాపబుల్ షోకు పబ్లిక్ నుంచి వచ్చిన విశేష స్పందన, జనంలోకి బాగా చొచ్చుకుపోయిన జైబాలయ్య నినాదం వెరసి బాలకృష్ణ ఇమేజ్ లో వచ్చిన పెరుగుదలకు సూచికగా చెప్పొచ్చు. గోపిచంద్ మలినేని ఇతర దర్శకులకు ఒక దారి చూపించాడు. బోయపాటికన్నా మిన్నగా ఆలోచిస్తే బాలయ్య ఎనర్జీని ఎలా వాడుకోవచ్చో తెరమీద ఆవిష్కరించాడు. బిజినెస్ లెక్కల్లో నెంబర్ ని పక్కనపెడితే విజయం విషయంలో వీరసింహారెడ్డి ఓడలేదు.