Director Dev Katta comments on Baahubali ticketsప్రస్తుతం “బాహుబలి 2” టికెట్లకున్న క్రేజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి మూడు, నాలుగు రోజుల పాటు అడ్వాన్సు బుకింగ్స్ ఇచ్చేయడంతో ధియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. ఏపీలో షోల సంఖ్య పెంచడంతో కాస్త పరిస్థితి మెరుగుగా ఉండగా, అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఈ సినిమా మొదటి రోజే పైరసీకి గురి కావడం విశేషం. అయితే ‘బాహుబలి 2’ లాంటి విజువల్ వండర్ కు ఈ పైరసీ ప్రభావం పెద్దగా చూపలేదనే చెప్పాలి.

ఎందుకంటే ఈ ‘విజువల్ వండర్’ ను నాణ్యమైన 4కే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ధియేటర్లో గానీ, వీలైతే ఐమాక్స్ భారీ సైజు స్క్రీన్లో గానీ ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ్ కట్టా లాంటి వాళ్ళయితే… నెల రోజుల సమయం పట్టినా గానీ, ఈ సినిమాను మొదటి సారి ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లోనే చూడాలని భీష్మించుకుని కూర్చున్నారు. దీనికి సంబంధించి దేవ్ కట్టా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అంతలా హల్చల్ చేస్తున్న ఆ ట్వీట్లో ఏముందంటే…

ప్రస్తుతం ఐమాక్స్ లో “బాహుబలి 2” టికెట్ సంపాదించడం కన్నా ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం తేలికగా ఉందని ఛలోక్తి వేసిన దేవ్ కట్టా, ఒక నెల రోజుల సమయం పట్టినా సరే, మొదటిసారి మాత్రం ఐమాక్స్ లోనే చూస్తానని ట్వీట్ చేసారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉందంటే… ఇక సాధారణ ప్రేక్షకులు ఈ సినిమా టికెట్ల కోసం ఎంతగా పడి చస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. మరి దేవ్ కట్టా కోరిక ఎప్పటికి నెరవేరుతుందో? లేదంటే ఈ లోపున ఎమ్మెల్యే అయిపోయి అప్పుడు ఐమాక్స్ టికెట్ కొంటారేమో??