Director Dasaradh on Mr Perfect movie Controversyప్ర‌భాస్ న‌టించిన `మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌` చిత్రాన్ని సినిమా విడుద‌ల‌కు ఏడాది ముందు వచ్చిన ఓ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించార‌ని కేసు వేయ‌డంపై ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. శ్యామ‌లా రాణి రాసిన `నా మ‌న‌సు కోరింది నిన్నే` న‌వ‌ల‌ను 2010, ఆగ‌స్టులో విడుద‌ల చేశారని, అయితే అంత‌కు 18 నెల‌ల ముందే 2009, ఫిబ్ర‌వ‌రి 19న `మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్` సినిమా క‌థ‌ను `న‌వ్వుతూ` పేరుతో రైట‌ర్స్ యూనియ‌న్‌ లో రిజిస్ట‌ర్ చేసిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అంటే ఈ సినిమా అసలు టైటిల్ ‘నవ్వుతూ’ అన్న విషయం బయటకు వచ్చింది.

అంతేకాకుండా న‌వ‌ల విడుద‌ల‌ కావ‌డానికి రెండేళ్ల ముందే 2008, డిసెంబ‌ర్‌లో `బిల్లా` షూటింగ్ కోసం ప్ర‌భాస్ మ‌లేషియాలో ఉన్న‌పుడు తాను, నిర్మాత దిల్‌ రాజు ఈ క‌థ చెప్ప‌డంతో, ప్ర‌భాస్ కూడా ఓకే అన్నాడ‌ని ద‌శ‌ర‌థ్ చెప్పారు. అయితే ఇదే విష‌యాన్ని ఆరు నెల‌ల క్రితం శ్యామ‌లా రాణికి రైట‌ర్స్ యూనియ‌న్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ వివరించిన‌ట్లు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ఆమె విష‌యాన్ని అర్థం చేసుకోక‌పోవ‌డం దురదృష్ట‌క‌ర‌మ‌ని ద‌శ‌రథ్ లేఖ‌లో రాశారు. ఇలాగే ఆరోప‌ణ‌లు కొన‌సాగిస్తే చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించిన‌ట్లు తెలుస్తోంది.