Director-Bobby-Accident -controversy‘పవర్, సర్ధార్ గబ్బర్ సింగ్, జై లవకుశ’ చిత్రాలతో టాలీవుడ్ నాట పాపులర్ అయిన దర్శకుడు బాబీ, ప్రస్తుతం ఓ యాక్సిడెంట్ వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం రాత్రి సమయంలో జరిగిన ఈ సంఘటనలో అమీర్ పేటకు చెందిన హర్మిందర్ సింగ్ కారు వెనుక భాగం డ్యామేజ్ అయ్యింది. అయ్యప్ప సొసైటీలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న హర్మిందర్ కుటుంబం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 33కు చేరుకోగానే, వెనుకగా దర్శకుడు బాబీ ప్రయాణిస్తున్న కారు వచ్చి డీకొట్టింది.

దీంతో వెంటనే హర్మిందర్ బాబీని నిలదీసే ప్రయత్నం చేయగా, తాను సినీ ఇండస్ట్రీలో ఓ అగ్ర దర్శకుడినని, అధికారులంతా తనకు తెలుసని బుకాయించాడట. అలాగే బాబీ కారులో ఉన్న మరో ముగ్గురు కూడా హర్మిందర్ ను బెదిరించే ప్రయత్నం చేయగా, చివరకు బాబీ తన ఇల్లు పక్కనే ఉంది, ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటుండగా, మరో వైపు హర్మిందర్ తల్లి రీతు కౌర్ కు ఛాతిలో నొప్పి రావడంతో అటు వెళ్ళగా, ఈ లోపున బాబీ కారులో వెళ్లిపోయినట్లుగా సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాబీ అండ్ కో పై ఫిర్యాదు చేసానని, పోలీసులు కూడా సరిగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మరోవైపు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం కారణంగా తన తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యిందని హర్మిందర్ చెప్పడంతో, కనీసం మానవత్వం లేకుండా బాబీ ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో బాబీ తన తరపు వివరణను మాత్రం ఇచ్చుకోలేదు.