dipa-karmakar-to-return-bmw-car-she-received-for-rio-olympicsభారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోసం ఆమె నివాసం దగ్గర, సమీపంలోని కొన్ని రోడ్లకు సంబంధించిన పనులను త్రిపుర ప్రభుత్వం ఆగమేఘాలపై నిర్వహిస్తోంది. రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన ప్రముఖ షట్లర్ పీవీ సింధు, మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కు కానుకగా బీఎండబ్ల్యూ కార్లను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బహూకరించిన విషయం విదితమే.

అయితే, రోడ్లు సరిగా లేకపోవడంతో కారులో ప్రయాణించడం చాలా ఇబ్బందిగా ఉందని, తిరిగి ఆ కారును ఇచ్చివేసి, అందుకు సరిపడ డబ్బును తీసుకుని స్థానికంగా లభించే ఒక కారును కొనుగోలు చేసుకోవాలని దీపా కర్మాకర్ కుటుంబం భావించినట్టు ఇటీవల మీడియాలో వార్తలొచ్చిన సంగతి విదితమే. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ అధికారులు మాత్రం మండిపడుతున్నారు.

రోడ్లు సరిగా లేవన్న కారణంతో కానుకగా వచ్చిన కారును తిరిగి ఇచ్చివేయాలన్న ఆలోచన కరెక్టు కాదని, ఆ విధంగా చేస్తే తమ రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందని అధికారులు అనుకున్నారు. దీంతో, కర్మాకర్ నివాసానికి దగ్గర, సమీపంలోని రోడ్లను బాగు చేస్తున్నారు. ఈ విషయాన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఇంజనీర్ సోమేష్ చంద్రదాస్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అగర్తలలో ఎన్నో ఖరీదైన కార్లు రోడ్లపై తిరుగుతున్నాయని త్రిపుర రోడ్లు, రవాణా శాఖ మంత్రి బాదల్ చౌదరి అన్నారు. తనకు కానుకగా వచ్చిన కారును వెనక్కి ఇచ్చివేయాలన్న దీపా కర్మాకర్ నిర్ణయం సబబు కాదన్నారు. అయితే, అగర్తలలోని రోడ్ల తీరుపై భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం మండిపడుతున్నాయి. ఇక్కడి రోడ్ల గురించి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.