Dil_Raju_Varasudu_Movieసినిమా స్థాయి ఎన్ని వందల కోట్లకు చేరుకున్నా అభిమానుల కన్నా ఎక్కువగా నిర్మాతలు హీరోలను దైవాంశ సంభూతులుగా చూస్తున్న మాట వాస్తవం. ఒకప్పుడు ప్రొడ్యూసర్ అంటే డిక్టేటర్ అనే వాళ్ళు. అంటే ఎంత పెద్ద స్టార్ అయినా సరే పెట్టుబడి పెడుతున్న వ్యక్తికి గౌరవం ఇవ్వాల్సిందే అన్న రీతిలో రోజులు ఉండేవి. యువచిత్ర ఆర్ట్స్ అధినేత కాట్రగడ్డ మురారి గారు తీసినవి అతి కొద్ది సినిమాలే అయినా ఆయన గురించి కాలం చేశాక కూడా చెప్పుకుంటున్నారంటే ఆ స్థాయిలో విలువలు పాటించారు కాబట్టే. రామానాయుడు కావొచ్చు లేదా విజయా అధినేతలు కావొచ్చు ఏనాడూ అవసరం లేని వాటికి తలొగ్గిన దాఖలాలు లేవు.

వారసుడు విడుదల వాయిదా గురించి నిర్మాత దిల్ రాజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో తిరిగి కొత్త ప్రశ్నలు మిగల్చడం మీడియాని సైతం ఆశ్చర్యపరిచింది. థియేటర్లను బ్లాక్ చేసినప్పుడు నేనే కరెక్ట్, ఇప్పుడు తప్పని పరిస్థితిలో చిరంజీవి బాలకృష్ణల కోసం త్యాగం చేశానని రిలీజ్ కు రెండు రోజులు ముందు చెప్పినప్పుడూ నేనే కరెక్ట్ అనే శైలి నిజంగా రాజుగారికే ప్రత్యేకం. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే ప్రమోషన్ల గురించి చర్చ వచ్చినప్పుడు విజయ్ ఎందుకు హైదరాబాద్ రావడం లేదన్న క్వశ్చన్ కు సమాధానం చెబుతూ సదరు హీరోగారు ఒకటే ఇస్తారట. ఈవెంట్ కి రావాలా లేక ఇంటర్వ్యూ ఇవ్వాలా ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఎంచుకునే సౌలభ్యం నిర్మాతకు ఉంటుందట.

అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి మీరు వస్తే బాగుంటుందని బ్రతిమాలో బలవంతం చేసో రప్పించే పలుకుబడి లేదన్న మాట. ఇది విజయ్ సిస్టం ఆయన ఇలాగే ఉంటారని గట్టిగా చెప్పేసినంత మాత్రాన బాధ్యత తప్పించుకున్న వాస్తవం కంటికి కనపడకుండా పోతుందా. ఒక రోజులో చెన్నై నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో తీసుకొచ్చి మళ్ళీ దించి రావడమనే చిన్న పని కూడా చేయించుకోలేని స్థితిలో యాభై సినిమాల నిర్మాణం, వందల చిత్రాల డిస్ట్రిబ్యూషన్ అనుభవమున్న ఒక టాప్ ప్రొడ్యూసర్ వల్లే కానప్పుడు రాబోయే తరంలో యువ నిర్మాతలు జీ హుజూర్ అంటూ పక్కరాష్ట్రాల హీరోల కాళ్లబేరాలు చేయాలేమో

ఇక్కడ ఎవరిష్టం వారిదని సింపుల్ గా తేల్చేస్తే ఎలా. ఇంట్లో ఉన్నప్పుడు అది వరిస్తుంది. బయటికి వచ్చాక మన మీద వందల కోట్ల బిజినెస్ జరుగుతున్నప్పుడు కనీసం ఒకటి రెండు సార్లు పబ్లిక్ లోకి రావాలి. చెన్నైలో స్టేజి మీద ఆడిపాడిన విజయ్ ఇంత దూరం వచ్చి తనతో సినిమా తీసిన దిల్ రాజు కోసం ఆఫీస్ బయట రెండు కాఫీలు తెచ్చి ఇవ్వడం కాదు నేరుగా ఏపీకో తెలంగాణకో వచ్చి ప్రమోట్ చేస్తే దానివల్ల కలిగే మేలు తెలియనిదా. ఆయనంతే ఒకటే ఇస్తారని రాజీపడే సంబరానికి ఇంత కష్టపడాలా. ఈ లెక్కన ఎప్పుడో గత ఏడాది మార్చిలో రిలీజైన ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావాలని ఇప్పటికీ యుఎస్ లో ప్రమోషన్లు చేస్తున్న తారక్, చరణ్ లను గురించి ఏమనాలో