Dil Raju Speech at Masooda Success Meet తెలుగు రాష్ట్రాల్లో వారసుడు థియేటర్లకు సంబంధించిన వివాదం గురించి తర్వాత మాట్లాడతానని చెప్పిన నిర్మాత దిల్ రాజు మాసూద సక్సెస్ మీట్లో అన్న మాటలు హాట్ టాపిక్ గా మారాయి. తాను ఏ సినిమాను తొక్కేయనని మంచి టాలెంట్ ని ప్రోత్సహించడానికి ఎంత దూరమైనా వెళ్తానని లవ్ టుడే డబ్బింగ్ వల్ల తనకు రూపాయి రాదని మంచి చిత్రాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగులో తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ తానసలు డబ్బు మనిషినే కాదని అయినా దాంతో ఏం చేసుకుంటామని కాసింత వేదాంతం టచ్ తో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టే ఈ స్టేట్మెంట్ ఇచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సరే అన్నారు బాగానే ఉంది. నిజంగా డబ్బు ఏం చేసుకుంటామని ఎందుకన్నారో అర్థం కాని ప్రశ్న. కాసేపు పైన చెప్పినదాని కోణంలోనే ఆలోచిద్దాం. సినిమా అనేది పక్కా వ్యాపారం. ఎవరు చేసినా అసలు ఉద్దేశం అదే. కోట్లు పెట్టేది పెట్టుబడి వెనక్కు వస్తే చాలని కాదు. లాభాలు కావాలని. అలాంటప్పుడు వందల కోట్లు పెట్టినా, టికెట్ రేట్లు పెంచండని ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా కారణం ఇంతేగా. విజువల్ గ్రాండియర్లు కాకపోయినా ఎఫ్3కి సాధారణంగా ఉన్న రేట్ల కంటే అదనంగా యాభై రూపాయల దాకా ఎందుకు పెంచి అమ్మారో అందరికీ తెలిసిందే. సర్కారు వారి పాట విజువల్ గ్రాండియర్ కాకపోయినా దానికి హైక్ అనుమతులు రావడం వెనుక ఏం జరిగింది.

అంతెందుకు బీస్ట్ లాంటి డబ్బింగ్ సినిమాని పంపిణి చేసినప్పుడు తక్కువకు కొన్నానని దిల్ రాజు హైదరాబాద్ లో దాని టికెట్ రేట్ 110 రూపాయలు పెట్టలేదే. అంతెందుకు ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం కన్నా లవ్ టుడేకి థియేటర్లు ఎక్కువ ఎలా దక్కాయి. క్రేజ్ ఉందని అంటే అది శుద్ద అబద్దమే. బుకింగ్ యాప్స్ ఓపెన్ చేసి టికెట్లు ఎన్ని అమ్ముడుపోయాయో చూస్తే అర్థమవుతుంది క్రేజ్ ఎంత ఉందో. టాక్ వచ్చాక పికప్ కావడం స్క్రీన్లు పెంచడం వేరే విషయం. అసలు ముందుగానే ఇంత గ్రాండ్ రిలీజ్ ని సెట్ చేయడం దేనికి సంకేతం. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ కి ప్రాధాన్యం ఇవ్వమని ఫిలిం ఛాంబర్ చెప్పినా అదంత అరణ్యఘోషే అని తేలిపోతోంది.

ఏ ఉద్దేశంతో తనకు అత్యాశ లేదని చెప్పుకున్నా దిల్ రాజే కాదు పరిశ్రమలో ఏ నిర్మాతైనా సరే లెక్కలతోనే బిజినెస్ చేస్తారు. తమకు అదనంగా ఒక్క రూపాయి వస్తుందన్నా ఎవరూ వదులుకోరు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లు కనక వర్షం కురిపించినప్పుడు ఎక్కువ ఆడియన్స్ కి చేరువ చేసే ఉద్దేశంతో వారం రోజుల తర్వాత రేట్లు ఏమైనా తగ్గించారా లేదే. ఫైనల్ రన్ ముగిసేదాకా హైదరాబాద్ లో చాలా మల్టీప్లెక్సుల్లో రెండు వందల యాభై రూపాయలపైనే ఉంది. వారసుడు గురించి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అన్నారు. ఒకవేళ ఆ రోజు నాకు తమిళ వెర్షన్లోనే భారీ లాభాలు వస్తున్నాయి తెలుగు మీద సీరియస్ గా లేను, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకే నా మద్దతుని నిజంగా ప్రకటిస్తే అప్పుడు నిజంగా దిల్ ఉందని ఒప్పేసుకోవచ్చు. చూద్దాం.