Dil Raju reacts on controversy on social mediaకురుక్షేత్ర యుద్ధంలో అశ్వద్ధామ హతః కుంజరః అనే ఎపిసోడ్ అందరికీ తెలిసే ఉంటుంది. ద్రోణాచార్యుడిని మోసం చేయడానికి ఆడిన ఆటలో ధర్మరాజు పావుగా మారతాడు. కుంజరః అనే పదం వినిపించకుండా నా తప్పేం లేదనే రీతిలో కృష్ణుడు వేసిన స్కెచ్ అది. ఇంత పెద్ద ఉదాహరణ ఎందుకయ్యా అంటే నిర్మాత దిల్ రాజు ఇవాళ తన చిన్న సినిమాల కొత్త ప్రొడక్షన్ లాంచ్ సందర్భంగా అన్న మాటలు అచ్చంగా దీన్నే గుర్తుకు తెస్తున్నాయి. నిన్న ఓ ఇంటర్వ్యూలో విజయ్ నెంబర్ వన్ కాబట్టి వరిసుకి ఎక్కువ థియేటర్లు వచ్చేలా తునివు డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడతానని అన్న మాటలు సోషల్ మీడియాలో రాత్రి నుంచే మాములు మంటలు రేపలేదు.

అసలు తన ఉద్దేశం వేరని ఇరవై సెకండ్ల వీడియోను తీసుకుని మీడియా కాంట్రావర్సీ చేస్తోందని అందుకే ఏం మాట్లాడాలన్నా భయం వేస్తోందని సెలవిచ్చారు. అంత స్పష్టంగా అనేదంతా అనేసి మీరే అపార్థం చేసుకున్నారని చెప్పడం టీవీ సీరియల్ కన్నా పెద్ద కామెడీగా అనిపిస్తోంది. మరి నేను గ్లామర్ గా ఉన్నాను కాబట్టే అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పడం ఏ కవరింగ్ కిందకు వస్తుంది. కేవలం ఆయన మీద గౌరవంతోనే వెబ్ లో ప్రెస్ లో ఎవరూ ఈ విషయాన్ని హై లైట్ చేయలేదు. ట్రోలర్స్ ఆ బైట్ ని వాడుకుని మీమ్స్ గట్రా చేసుకున్నారు కానీ అసలది ఎంత మాత్రం ప్రాధాన్యం ఇవ్వాల్సిన పాయింటే కాదనేది అందరికీ తెలుసు.

ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిల్ రాజు మాటలు చాలా దూరం వెళ్లిపోయాయి. అజిత్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో భగ్గుమంటున్నారు. తమిళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ దీనికి మద్దతుగా వ్యతిరేకంగా రెండు వర్గాలుగా విడిపోయి కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. అదనపు థియేటర్ల కోసం ఉదయనిధి స్టాలిన్ ని కలుస్తానని చెప్పిన దిల్ రాజు రేపో ఎల్లుండో ఆ పని చేస్తారు కానీ తిరిగి వచ్చాక ఏపీ తెలంగాణలో వారసుడు వ్యవహారం గురించి ఏమైనా మాట్లాడతారేమోనని సగటు ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ఏదో డీవియేట్ చేయడానికి అన్నట్టు అవతార్ 2 పైరసీ గురించి చెప్పడం మరో ట్విస్ట్. ఫ్రీగా పెన్ డ్రైవ్ లో వేసిచ్చినా దాన్ని ఇంట్లో చూసే ఆలోచనలో ఎవరూ లేరు. అందుకే ముందు రోజే ప్రింట్ వచ్చినా డిస్నీ లైట్ తీసుకుంది.

అనవసరంగానో పొరపాటునో అనేసింది దాన్ని వెనక్కు తీసుకోలేరు కానీ దిల్ రాజుకు ఇప్పుడింతా కవరింగ్ చేయడం పెద్ద తలనొప్పే. సింపుల్ గా మీడియా మీదకు తోసేస్తే చెల్లదు. ఇదేదో ఆధారం లేని నోటి మాట పంచాయితీ కాదు. వీడియో సాక్ష్యం ఉంది. ఇదంతా ఓకే కానీ మరి ఆ ముందు వెనకా ఏమన్నది కూడా రాజుగారే రిపీట్ చేస్తే మరింత స్పష్టత వస్తుందిగా. మెయిన్ స్ట్రీమ్ తో పాటు వెబ్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ లాగా బాధ్యత లేకుండా ప్రవర్తించేది కాదు. ఏ మాత్రం పక్కదారి పట్టించేలా ఉన్నా నెటిజెన్లు పట్టేసుకుంటున్నారు. అలాంటప్పడు ఏదో వైరల్ కావాలనో మరో ఉద్దేశంతో ఎందుకు వక్రీకరిస్తుంది. జరిగింది అంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు సమర్ధింపులేలా.